నేనొక దుర్గం, నాదొక స్వర్గం..అనర్గళం..అనితర సాధ్యం నా మార్గం. ఈ మాటలు పునాది రాళ్లను కదిలించి గాడ్ ఆఫ్ మాసెస్‌గా మారిన గాడ్ ఫాదర్‌కు అక్షరాలా సరిపోతాయి. నిజంగానే తనదైన మార్గాన్ని సృష్టించుకుని ఆ మార్గాన్ని మరెవరికీ అనితర సాధ్యమని నిరూపించారు. అందుకే అతను ఓ మెగాస్టార్. ఇంతకీ ఈ మెగాస్టార్ బిరుదు ఎప్పుడు చేరిందో తెలుసా…
అతి సామాన్య కుటుంబం నుంచి సినీ రంగంలో అడుగుపెట్టిన మొగల్తూరు కుర్రోడు కొణిదెల శివశంకర వర ప్రసాద్ మెగాస్టార్‌గా మారి తెలుగు చలన చిత్ర పరిశ్రమను శాసించే స్థాయికి చేరడం వెనుక ఓ కఠోర శ్రమ, అంతులేని పట్టుదల, కసి అన్నీ కలగలిపి ఉన్నాయి. అందుకే అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబులు ఏలుతున్న మద్రాస్ వేదికగా ఉన్న తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిలవగలిగారు. నటుడిగా నిరూపించుకున్నారు. ఎదిగారు. అప్పటి వరకూ ఉన్న డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ చిరు ప్రవేశం తరువాత మారిపోయాయి. ప్రేక్షకులను తనవైపు తిప్పుకోగలిగారు. ఆగస్టు 22వ తేదీన 70వ జన్మదినోత్సవం జరుపుకోనున్న చిరంజీవి పేరుకి ముందు మెగాస్టార్ బిరుదు ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చిందనేది చాలా మందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం..
1978లో పునాది రాళ్లతో సినీ రంగ ప్రవేశం చేసిన చిరంజీవి అనతికాలంలోనే అగ్ర నటుడిగా ఎదిగారు. అప్పటి నుంచి పదేళ్ల వరకు అంటే 1988లో మరణమృదంగం విడుదలయ్యేవరకూ చిరంజీవిగానే పరిచయం. ఆ సమయంలో ఏ కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మరణ మృదంగం సినిమా నుంచి చిరంజీవి పేరుకు ముందు మెగాస్టార్ అనే బిరుదు చేరింది. అప్పటికే సూపర్ స్టార్, రెబెల్ స్టార్ వంటి బిరుదులతో ఇతర హీరోలుండటంతో ఆ సినిమా నిర్మాత కేఎస్ రామారావు ఈ బిరుదు ఇచ్చారు.
ఇక అప్పటి నుంచి కొణిదెల కుటుంబం కాస్తా మెగా కుటుంబంగా మారింది. ఎంతగా అంటే చిరంజీవి ఇంటి పేరే మెగా అనుకునేంతగా. ఆ తరువాత కాలక్రమంలో పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి అత్యున్నత బిరుదులు వచ్చినా ఫ్యాన్స్ దృష్టిలో మాత్రం ఎప్పటికీ మెగాస్టారే. అందుకే మెగాస్టార్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ..జన్మదిన శుభాకాంక్షలు