కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్న చిరంజీవి ఇవాళ 70వ ఏట ప్రవేశించారు. ఈ అభిమానం కేవలం ఆయన చేసిన సినిమాలతో వచ్చిందనుకుంటే పొరపాటే. సామాజిక సేవా కార్యక్రమాలు..తోటి నటీనటులకు సహాయం చేయడంలో చిరు తరువాతే ఎవరైనా. అందుకే ఆయన రేంజ్ వేరే అంటారు అంతా..
మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినం సందర్భంగా అభిమానులు, ప్రముఖులు, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు అంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. కొందరు తమకు చేసిన సహాయం గుర్తు చేసుకుంటున్నారు. ఇంకొందరు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా చిరంజీవి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్ని వివరిస్తున్నారు. ఇంకొందరైతే చిరంజీవి ఎలా తమ కష్టాల్ని తీర్చారో చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఓ పాత వీడియో వైరల్ అవుతోంది. చిరంజీవి ఓ అగ్రనటుడి అప్పులు ఏ విధంగా తీర్చారో ఆ వీడియోలో స్పష్టంగా ఉంది. అందుకే ఫ్యాన్స్ ఆ పాత వీడియో బయటకు తీసి వైరల్ చేస్తున్నారు.
ప్రముఖ నటుడు శరత్ కుమార్ చిరంజీవికి మంచి స్నేహితుడు. ఓ సమయంలో కెరీర్ బాగా డౌన్ అయి కష్టాల్లో పడ్డాడు. అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. సరిగ్గా ఆ సమయంలో చిరంజీవి మంచి పీక్స్‌లో ఉన్నారు. ఓ నిర్మాత శరత్ కుమార్ వద్దకు వచ్చి ఓ ఆఫర్ ఇచ్చాడు. చిరంజీవి డేట్స్ తీసుకొస్తే సినిమా తీసి వచ్చిన లాభాలతో అప్పులు తీర్చేలా సహాయం చేస్తాననేది ఆ ఆఫర్. ఇక శరత్ కుమార్‌కు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో చిరంజీవికి ఫోన్ చేశారు. పర్సనల్‌గా మాట్లాడాలని చెప్పి షూటింగ్ స్పాట్‌కు వెళ్లారు. శరత్ కుమార్‌ని చూసి..షూట్ మళ్లీ పెట్టుకుందాం..శరత్ వచ్చాడు మాట్లాడాలంటూ దర్శక నిర్మాతలకు చెప్పారు చిరంజీవి. లంచ్ తరువాత విషయం ఏంటని అడిగారు.
నీ డేట్స్ కావాలంటూ అసలు సంగతంతా చిరుకు చెప్పాడు శరత్ కుమార్. ఇప్పుడు చేస్తున్న సినిమా పూర్తి కాగానే డేట్స్ ఇస్తాను, ఏర్పాట్లు చేసుకోమని చెప్పడంతో సంతోషంతో పారితోషికం ఎంతని అడిగాడు శరత్ కుమార్. నువ్వు నాకు పారితోషికం ఇస్తావారా అంటూ కోప్పడి కష్టాల్లో ఉన్నానన్నావ్‌గా పారితోషికం ఏం వద్దు డేట్స్ తీసుకో అంతే అని పంపించేశారు. ఇదంతా ఆ వీడియోలో స్వయంగా శరత్ కుమార్ చెప్పుకొచ్చారు. చిరంజీవి స్థాయి అందుకే అందరికీ ప్రత్యేకమంటున్నారు అభిమానులు.