సరిగ్గా 70 ఏళ్ల క్రితం ఆ మారుమూల గ్రామ ప్రజలకు తెలియదు. అతనో లెజెండ్ అని. ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన బుడ్డోడు తెలుగు సినీ పరిశ్రమను శాసిస్తాడని. దాదాపు 5 దశాబ్దాలుగా తెలుగు సినిమాను దశ దిశగా మారి నడిపిస్తున్నందుకే అనుకుంటా పేరులో అమరత్వాన్ని నింపారు. పునాది రాళ్లను కదిలించి ఫ్యాన్స్ గుండెల్లో ఖైదీగా మారి…గాడ్ ఫాదర్‌గా మార్గనిర్దేశనం చేస్తున్న మెగాస్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలతో…
మెగాస్టార్ చిరంజీవిగా కోట్లాది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిరు ఏడు పదుల వయస్సులో అడుగెడుతున్నాడు. ఆగస్టు 22న 70వ జన్మ దినోత్సవం సందర్భంగా చిరంజీవి కెరీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీ కోసం..
మెగాస్టార్‌కు 70 ఏళ్లు వచ్చేశాయి. మరో మూడేళ్లు గడిస్తే సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటారు. 1955 ఆగస్టు 22వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన కొణిదెల శివశంకర వరప్రసాద్ రావు అలియాస్ చిరంజీవి..కాణిదెల వెంకట్రావ్, అంజనా దేవి దంపతులకు పెద్ద కుమారుడు. నర్శాపూరంలోని వైఎల్ కళాశాల నుంచి కామర్స్ డిగ్రీ తీసుకుని నటనా రంగంలో అదృష్టం పరీక్షించుకునేందుకు 1976లో 21 ఏళ్ల వయస్సులో మద్రాసు పట్టణానికి చేరారు. అక్కడ మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాడు. 1978లో మొదటి సినిమా పునాదిరాళ్లుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి ఆ తరువాత తిరుగు లేకుండా పోయింది.
ప్రముఖ తెలుగు హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను 1980 ఫిబ్రవరి 20న వివాహం చేసుకోవడం ద్వారా సినీ పరిశ్రమలో స్థానం పదిలం చేసుకున్నారు. స్వయంకృషి, ఘరానా మొగుడు, ఆపద్భాంధవుడు, ఇంద్ర, ముఠా మేస్త్రి, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సినిమాలతో తానేంటో నిరూపించుకున్నారు. 1983లో విడుదలైన ఖైదీ సినిమాతో చిరంజీవికి స్టార్ డమ్ వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 2007లో సూపర్ హిట్ కొట్టన శంకర్ దాదా జిందాబాద్ సినిమా తరువాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన చిరు తొలి ప్రయత్నంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 18 స్థానాలు గెల్చుకున్నారు. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యునిగా, మంత్రిగా పనిచేశారు.
2017లో తిరిగి ఖైదీ సినిమాతో 150వ సినిమా ద్వారా టాలీవుడ్ రీ ఎంట్రీ గ్రాండ్‌గా ఇచ్చారు. చిరంజీవి ఇప్పటి వరకు 4 నంది అవార్డులతో పాటు పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెల్చుకున్నారు. భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది.
1978 నుంచి ఇప్పటి వరకూ 155 సినిమాలు పూర్తి చేసుకుని 156వ సినిమా విశ్వంభరతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమౌతున్నారు. ఆగస్టు 22న చిరు 70వ జన్మదినోత్సవ కానుకగా విశ్వంభర సినిమా టీజర్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక అనిల్ రావిపూడితో 157వ సినిమా మన శివ శంకర్ వర ప్రసాద్ గారు వస్తున్నారు. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్..