తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అన్నదాతల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. యాసంగి సీజన్ మొదలవుతున్న వేళ.. ప్రభుత్వం అందించే ‘రైతు భరోసా’ నిధులు ఎప్పుడు ఖాతాల్లో జమ అవుతాయా అని రైతులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి రైతు భరోసా విషయంలో ఎన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు పంట సాగు చేయకపోతే డబ్బులు వస్తాయా రావా? ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? డిసెంబర్ 9వ తేదీకి, రైతు భరోసా ప్రకటనకు ఉన్న లింక్ ఏంటి? ఇంతకు లేటెస్ట్ అప్ డేట్ ఏంటి..?
వానాకాలం సీజన్‌లో కేవలం పంటలు సాగు చేసిన భూములకు మాత్రమే డిజిటల్ సర్వే ఆధారంగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు యాసంగి సీజన్ విషయానికి వస్తే.. ఎల్ నినో ప్రభావం వల్ల సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని, అలాగే కరెంట్ కూడా సరిగ్గా అందించలేమని ప్రభుత్వం చెబుతోంది. అందుకే ఈ సీజన్‌లో వరి పంట సాగు చేయవద్దని, కేవలం ప్రత్యామ్నాయ పంటలు మాత్రమే వేసుకోవాలని అధికారులు పదేపదే సూచిస్తున్నారు. దీంతో ఒకవేళ నీళ్లు లేక పంటలు సాగు చేయకపోతే తమకు రైతు భరోసా డబ్బులు వస్తాయా లేదా అనే ప్రశ్నార్ధకం రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
మరోవైపు ఇటీవల కురిసిన రెండు తుఫాన్ల కారణంగా చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి పంటలు నేలవాలిపోయి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. ఇప్పటివరకు ప్రభుత్వ తరఫున ఎలాంటి నష్టపరిహారం ప్రకటన రాలేదని, దీనికి తోడు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా దీనిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో, అసలు ఈసారి రైతు భరోసా అందుతుందా లేదా అన్న అనుమానాలు మరింత బలపడ్డాయి.
అయితే, రైతుల్లో నెలకొన్న ఈ ఆందోళనలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం లోలోపల కీలక ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధులను అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి సాగుతో సంబంధం లేకుండా, గత ఏడాది మాదిరిగానే అర్హులైన రైతులందరికీ యాసంగి రైతు భరోసా నిధులను జమ చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. నీటి కొరత కారణంగా పంట వేయలేని రైతులకు కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఈ నిధుల విడుదలపై ఓ అప్ డేట్ కూడా వినిపిస్తోంది. వచ్చే డిసెంబర్ 9వ తేదీ నాటికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా మూడేళ్లు పూర్తి కాబోతోంది. ఈ మూడేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే ప్రత్యేక వేడుకల్లో, సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదలపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ డిసెంబర్ 9వ తేదీన సీఎం ఈ గుడ్ న్యూస్ ప్రకటిస్తే, రాబోయే సంక్రాంతి పండుగ నాటికి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది.
