రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోల్కోండ ఆర్మీ క్యాంపస్ నుంచి షాబాద్ వెళ్తున్న ఆర్మీ వాహనం అల్లావాడ గేట్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం పల్టీలు కొట్టడంతో 14 మంది జవాన్లు గాయపడగా అందులో 8 మంది పరిస్థితి విషమంగా మారింది. దీంతో వారిని హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని అల్లావాడ గేట్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ ట్రైనింగ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ క్యాంపు నుంచి షాబాద్ మండలంలోని ట్రైనింగ్ సెంటర్‌కు జవాన్లు ప్రత్యేక వాహనంలో బయలుదేరారు. ట్రైనింగ్ పర్పస్ కోసం వెళ్తున్న క్రమంలో, వీరి బండి అల్లావాడ గేట్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. ప్రశాంతంగా సాగిపోతున్న ప్రయాణంలో క్షణాల్లోనే పెను విషాదం నెలకొంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆర్మీ వెహికల్‌ను ఒక ట్రైనర్ నడిపిస్తున్న క్రమంలో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పింది. వేగంగా వెళ్తున్న బండి నియంత్రణ కోల్పోవడంతో రోడ్డుపై పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తూ, పల్టీలు కొట్టిన ఆ ఆర్మీ వెహికల్ పక్కనే ఉన్న ఒక చెట్టుకు తగిలి మళ్లీ యధావిధి స్థానంలోకి వచ్చి ఆగిపోయింది. ఒకవేళ చెట్టు అడ్డుగా లేకపోయి ఉంటే ప్రమాద తీవ్రత మరింత దారుణంగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఆర్మీ వాహనంలో మొత్తం 14 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. బండి పల్టీలు కొట్టడంతో అందులో ఉన్న జవాన్లందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా ఈ 14 మందిలో 8 మంది జవాన్ల పరిస్థితి అత్యంత సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన జవాన్లందరినీ హుటాహుటిన అంబులెన్స్‌లలో చికిత్స నిమిత్తం గోల్కొండ ఆర్మీ హాస్పిటల్‌కు తరలించారు.
ప్రస్తుతం గోల్కొండ ఆర్మీ హాస్పిటల్లో డాక్టర్ల బృందం గాయపడిన జవాన్లకు అత్యవసర వైద్యం అందిస్తోంది. సీరియస్‌గా ఉన్న 8 మంది జవాన్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై ఆర్మీ, పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. దేశ రక్షణ కోసం శిక్షణ పొందుతున్న మన జవాన్లు ఇలా ప్రమాదానికి గురికావడం నిజంగా బాధాకరం.
