సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తరువాత అనిల్ రావిపూడి క్రేజ్ పెరిగింది. తాజాగా మెగా 157 సినిమాతో మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు అటు బాలయ్య, ఇటు చిరు అభిమానులకు ఒకేసారి బిగ్ అప్డేట్ ఇస్తున్నారు. ఈ ఇద్దరు అగ్ర హీరోలతో కలిసి సినిమా చేయనున్నారా…పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం టాప్ స్థానంలో ఉన్న సీనియర్ నటులు ఇద్దరు. ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా మరొకరు నటసింహ నందమూరి బాలకృష్ణ. ఈ ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందనే ప్రశ్న వస్తే ఆ ఊహే అద్భుతమంటారు ఫ్యాన్స్. ఇద్దరు అగ్ర హీరోల్ని ఒకే ఫ్రేమ్‌లో చూడాలని ప్రతి అభిమానికి ఉంటుంది. అలాగని ఇది అసాధ్యం కానే కాదు. ఇప్పటి వరకు మల్టీస్టారర్ సినిమాలు చాలా వచ్చాయి. గతంలో కృష్ణ, శోభన్ బాబు, ఎన్టీఆర్, ఏఎన్నార్లు కలిసి నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అప్పటి ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు..ఇప్పుడు వేరు. ఇప్పుడంతా పోటీ వాతావరణం. అందుకే ఇలా ఇద్దరు అగ్ర హీరోలతో కలిసి సినిమా తీయాలంటే ఆషామాషీ కాదు.
ఇప్బుడీ విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. తాజాగా చిరంజీవితో కలిసి మెగా 157 సినిమా మన శంకరవరప్రసాద్ గారు తెరకెక్కించనున్నారు. చిరంజీవి-బాలయ్యతో కలిసి సినిమా తీసే అవకాశం వస్తే ఏం చేస్తారని ప్రశ్నించినప్పుడు కచ్చితంగా సిద్ధంగా ఉన్నానని సమాధానమిచ్చారు. అయితే రెండు వేర్వేరు మేనరిజంలతో ఉండే వ్యక్తుల్ని డీల్ చేయాలంటే కధ చాలా బలంగా ఉండాలని అంటున్నారు. గతంలో కూడా మంచి కధ లభిస్తే బాలయ్యతో కలిసి సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చిరంజీవి చెప్పిన సంగతిని అనిల్ రావిపూడి గుర్తు చేశారు.
ఇద్దరు అగ్రహీరోల మేనరిజంకు తగ్గట్టు మంచి కధ ఉండాలి, అది ప్రేక్షకులకు నచ్చాలి..అలాంటి కధ దొరికితే ఇద్దరితో కలిసి సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అనిల్ స్పష్టం చేశారు. అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు అటు మెగా ఇటు నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. ఇదే నిజమైతే ఎంత బాగుంటుందో అంటున్నారు. ఎప్పుడెప్పుడు ఆ సందర్భం వస్తుందా అని నిరీక్షణ మొదలెట్టారు.