వర్షాకాలం అంటేనే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అలాంటి గత 4-5 రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతుండటంతో వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు వేధిస్తుంటాయి. వైరల్ ఫీవర్లు విజృంభిస్తుంటాయి. గత వారం రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా ఏపీలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాల కారణంగా వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. సీజనల్ వ్యాధులు కూడా చుట్టుముడుతున్నాయి. గత 10 రోజుల్లో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైరల్ ఫీవర్లతో 19 వేల కేసులు నమోదయ్యాయి. కొందరు అడ్మిట్ కాగా మరి కొందరు చికిత్స తీసుకున్నారు. డెంగ్యూ, మలేరియా పాజిటివ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో నీరు నిలిచి ఉండటంతో ఈ రోగాలు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో వైరల్ లేదా సీజనల్ వ్యాధుల నుంచి ఎలా రక్షణ పొందాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
వర్షాకాలంలో విష జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకూ కాచి చల్లార్చిన నీళ్లు తాగాల్సి ఉంటుంది. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బయటి ఫుడ్ పూర్తిగా మానేయాలి. ఫ్రైడ్ పదార్ధాలు తినకూడదు. ఎందుకంటే కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఎప్పటికప్పుడు శుభ్రమైన బట్టలు ధరిస్తుండాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. లేకపోతే డీ హైడ్రేషన్ సమస్య రావచ్చు.
ఇక వర్షం పడుతున్నప్పుడు పిడుగుల నుంచి అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ స్థంభాలు, పొలాలు, చెట్ల కింద ఉండవద్దు. రోడ్లపై ముఖ్యంగా నీరు నిలిచిన ప్రాంతాల్లో వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అనారోగ్యమైనా లేదా వైరల్ ఫీవర్ ఎదురైనా నిర్లక్ష్యం వహించకుండా వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే డెంగ్యూ, మలేరియాలో కూడా వైరల్ ఫీవర్ లక్షణాలే కన్పిస్తాయి.