మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ సినిమా ఇండస్ట్రీ, రాజకీయ సభగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ తనలోని ఆవేదనను, ఆగ్రహాన్ని అంతా కక్కేశారు. ‘సాయితేజ్’ ప్రమాదంపై మీడియా చేసిన అతి.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. కేవలం తన వల్ల సినీ పరిశ్రమను టార్గెట్ చేసి విధానం.. ఏపీలో జగన్ సర్కార్ నిర్ణయం పై సీరియస్ అయ్యారు. అయితే పవన్ కల్యాణ్ సినీ రంగ సమస్యల విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించడం తెలిసిందే.
ఇక పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని అదేస్థాయిలో ఘాటుగా బదులిచ్చారు. పవన్ కళ్యాన్ నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడితే అందరికీ బాగుంటుందని.. ఆయన అంటున్న మాటల్లో ఏ ఒక్కటైనా నిరూపించగలడా.. ఆ యుద్ధ వీరుడు, యోధుడు అంటూ సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ కావాలని అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం థియేటర్లు తెరిస్తే, ఏపీలో థియేటర్లను వైసీపీ సర్కారు మూతవేసిందని, ఇదంతా తనపై కక్షతోనే అని పవన్ కల్యాణ్ ఆరోపణలపై స్పందిస్తూ.. ఏపీలో 1100 వరకు థియేటర్లు రన్నింగ్ కండిషన్ లో ఉంటే, వాటిలో 800 థియేటర్లలో ప్రస్తుతం ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అయితే తెలంగాణలో మరి 519 థియేటర్లకు గాను, 413 థియేటర్లే నడుస్తున్నాయి.
ఈ విషయం ఆ యుద్ద వీరుడికి తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు సినీ రంగాన్ని ఏపీ సీఎం జగన్ తన ఉక్కు పాదాల కింద నలిపేస్తుంటే కాపాడేందుకు వచ్చిన యోధుడు గారూ, అయ్యా పీకే గారూ ‘లవ్ స్టోరీ’ సినిమాకు ఏపీలోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి అన్నారు. ఈ సినిమా ఆంధ్రలో మంచి వసూళ్లు సాధించి ప్రొడ్యూసర్లు లాభాల బాట పట్టారు. మరి సిని పరిశ్రమకు ఏ విధంగా ఇబ్బంది పెట్టామో చెప్పాలని నాని తెలిపారు. సినీ నిర్మాతలకు ఏపీలోనే ఎక్కువ షేర్ వస్తుందని నాని తెలిపారు. గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలు సినీ పరిశ్రమకు రెండు కళ్లు అని సినీ పెద్దలు అంటున్న విషయం తెలిసిందే.. ఈ సమయంలో పవన్ కళ్యాన్ ఇలాంటి అవాకులు.. చెవాకులు పలకడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి పేర్ని నాని అన్నారు.