బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారింది. ఫలితంగా ఏపీ తెలంగాణలో ఇవాళ్టి నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ తీరం దాటనుంది. ఫలితంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ కొమురం భీమ్ ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. మరోవైపు ఉరుములు, మెరుపులతో పిడుగులు పడనున్నాయి. అందుకే వర్షం పడేటప్పుడు బయటకు రావద్దని సూచిస్తున్నారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. బంగాళాఖాతాంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన తరువాత ఇవాళ ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా మధ్య గోపాల్ పూర్ వద్ద తీరం దాటనుంది. అందుకే కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
వాయగుండం కారణంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షం పడనుంది. అందుకే ఈ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ అయింది. మరోవైపు కాకినాడ, కోనసీమ జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. భారీ వర్షాలతో గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ క్రమంలో లంక గ్రామాల్ని అప్రమత్తం చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ప్రస్తుతం 8 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.