ఇటీవల పలు చోట్ల రైలు ప్రమాదాలు వరుసగా జరుగుతున్న విషయం తెలిసిందే. మానవ తప్పిదాలు.. టెక్నికల్ ఇబ్బందుల వల్లనో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా రాజమండ్రిలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పిపోయింది. విషయం తెలిసిన వెంటనే అటుగా వస్తున్న పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మద్య రైల్వే ప్రకటించింది. ఆ సమయానికి ఏ రైలు వచ్చినా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని.. రైళ్లు రద్దు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.
ప్రస్తుతం ఒకే ట్రాక్ పై రైళ్లు నడుస్తున్నాయని.. ఈ కారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు ప్రకటించారు. కలకత్తా వెళ్తున్న రైలు ఐఎల్ టీడీ ఫై ఓవర్ వద్ద అదుపు తప్పిపోయింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో వెంటనే అటుగా వస్తున్న పలు రైళ్లను అధికారులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ-విశాఖ పట్నం మద్య నడిచే 9 ప్యాసింజర్ రైళ్లను ఈ రోజు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరో రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గూడ్స్ ట్రైన్ ప్రమాదానికి గల కారణం ఎంటో తెలుసుకునే పనిలో ఉన్నారు రైల్వే అధికారులు. అయితే ఈ ప్రమాదంలో పలు బోగీలు చెల్ల చెదురుగా పడిపోయాయి.. అందులో ఉన్న కార్లు పాక్షికంగా దెబ్బదిన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం అధికారులు రైల్వే స్టేషన్ వద్ద పునరుద్దరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. త్వరగా పూర్తి చేసి రైళ్ల రాకపోకలు పునఃప్రారంభిస్తామని రైల్వే అధికారులు తెలియజేశారు.