ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ కేన్సర్ మహమ్మారి భయపెడుతూనే ఉంది. అందుకే శరీరంలో కన్పించే కొన్ని లక్షణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదంటారు. మీ శరీరంలో ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి.
ఇప్పటికీ మనిషిని భయపెట్టే కేన్సర్ చాలా రకాలుగా ఉంటుంది. అందులో లివర్ కేన్సర్ ముఖ్యమైంది. స్థూలకాయం, ఆల్కహాల్ సేవనం కారణంగా లివర్ కేన్సర్ ముప్పు పెరిగిపోతోంది. కాలేయంలోని కణజాలం అదుపులేకుండా పెరిగితే లివర్ కేన్సర్ ఉందని అర్ధం. మీ లైఫ్‌స్టైల్ మార్చుకోవడంతో పాటు హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా లివర్ కేన్సర్ అరికట్టవచ్చు. హెపటైటిస్ బి, హైపటైటిస్ సి వ్యాధులకు సరైన చికిత్స తీసుకోవడం ద్వారా కూడా లివర్ కేన్సర్ నియంత్రించవచ్చు. లివర్ కేన్సర్ అరికట్టడం ద్వారా 80 లక్షల నుంచి 1.5 కోట్లమంది ప్రాణాలు కాపాడవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లివర్ కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి.
రానున్న 25 ఏళ్లలో లివర్ కేన్సర్ మరణాలు రెండింతలు పెరగవచ్చని అంచనా. ఓ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభవించే కేన్సర్ మరణాల్లో లివర్ కేన్సర్ మూడో స్థానంలో ఉంది. ఈ పరిస్థితిలో మార్పు రాకుంటే 2050 నాటికి 7.6 లక్షలుగా ఉన్న లివర్ కేన్సర్ మరణాలు 13 లక్షలకు పెరగవచ్చు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ లైఫ్‌స్టైల్ మార్చుకుంటే లివర్ కేన్సర్ అరికట్టవచ్చు.
ఈ లక్షణాలుంటే జాగ్రత్త
అకారణంగా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, పొట్ట పైభాగంలో నొప్పి, వాంతులు, వికారం, కడుపులో అసౌకర్యం, బలహీనత, నిస్సత్తువ, కడుపు ఉబ్బరం, పచ్చ కామెర్లు, తెల్లటి మలం. ఈ లక్షణాలు కన్పిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. తక్షణం వైద్యుని సంప్రదించాలి.