బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రెండ్రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడనుంది. ఫలితంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు వంకలు పొంగుతుండటంతో గిరిజన ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మరో 4-5 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ తెలిపింది.
అల్పపీడం మరింతగా బలపడనుండటంతో రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదీతీర ప్రాంతాలకు అలర్ట్ జారీ అయింది. వాగులు-వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించిందగి. కృష్ణా నదికి మళ్లీ మొదటి వరద హెచ్చరిక జారీ చేశారు. ఇక అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
ఇక పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. రానున్న 3 రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే ప్రమాదముందని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆరుబయట లేదా పొలాలు, చెట్లు, టవర్ల కింద ఉండవద్దని సూచిస్తున్నారు.