దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం.. వేలాది కోట్ల రూపాయల సామ్రాజ్యం.. దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానులు! అయినాసరే, అధికారంలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట.. పెద్దల పట్ల తనకెంత గౌరవం ఉందో చాటుకుంటూ ఆయన పాదాలకు నమస్కరించారు అనంత్ అంబానీ! డబ్బు, హోదా ఎంత ఉన్నా.. సంస్కారం, వినయం ఉంటేనే మనిషి అసలైన శ్రీమంతుడవుతాడని నిరూపించిన ఆ అరుదైన క్షణం గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. ..
అన్నమయ్య జిల్లా మదనపల్లె వేదికగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యమైంది. ఈ చరిత్రాత్మక శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేదికపై రిలయన్స్ తరఫున మాట్లాడిన అనంత్ అంబానీ.. ‘నన్ను ఆంధ్రప్రదేశ్ బిడ్డగా భావించండి, రాష్ట్ర అభివృద్ధికి మా వంతు పూర్తి సహకారం అందిస్తాం’ అని ప్రకటించి అందరి మనసులూ గెలుచుకున్నారు.

ఇక కార్యక్రమం ముగిసిన తర్వాత వేదికపై నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్తుండగా.. అనంత్ అంబానీ ఒక్కసారిగా ఆయన వద్దకు నడుచుకుంటూ వచ్చారు. ఎవరికీ ఎలాంటి సంకేతం ఇవ్వకుండా, ఏమాత్రం అహంభావం ప్రదర్శించకుండా.. వంగి చంద్రబాబు పాదాలకు నమస్కరించారు! ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ ఫ్యామిలీకి చెందిన యువ పారిశ్రామికవేత్త.. ఒక సీనియర్ రాజకీయ నాయకుడికి, పెద్ద మనిషికి ఇచ్చిన ఆ అత్యున్నత గౌరవాన్ని చూసి అక్కడున్నవారందరూ అవాక్కయ్యారు. ఆ ఊహించని పరిణామానికి సీఎం చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయి, ఎంతో ప్రేమతో ఆయన్ను ఆశీర్వదించారు. ఈ రోజుల్లో డబ్బు ఉంటే చాలు, పక్కన వాళ్ళని చిన్నచూపు చూసేవారు ఎంతోమంది ఉంటారు. కానీ, అంబానీ కుటుంబం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ.. పెద్దలను గౌరవించడంలో, సంస్కారాన్ని ప్రదర్శించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు అనడానికి ఇదే నిదర్శనం. అయతే అనంత్ అంబానీ చేసిన ఈ పని సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. ‘డబ్బు ఎంత ఉన్నా సంస్కారం దానంతట అదే రాదు, అది అంబానీ కుటుంబం నేర్పిన సంస్కారం’ అంటూ నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
