మొబైల్ ఫోన్.. దీన్ని కనిపెట్టిన వాడు ఎవడో గానీ నిజంగా దండేసి దండం పెట్టాలి. లేకపోతే ఏంటి… ప్రస్తుతం ఇది లేకపోతే ఒక్కపని కూడా జరగదు. ఉదయం నిద్రలేచిన రాత్రి నిద్రపోయే వరకు ప్రతి పనిలోనూ మొబైల్ అవసరం కచ్చితంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన శరీరంలో చేయి, కాలు ఎలానో.. మొబైల్ కూడా అలా ఓ భాగమైపోయింది. మరి అలాంటి మొబైల్ పోతే, తిరిగి దక్కించుకోవడం చాలా కష్టం. పోలీసుల దగ్గరకు వెళ్లాలి, ఫిర్యాదు చేయాలి. ఇవన్నీ కాదనుకుంటే టెక్నికల్ గా అయినా ప్రయత్నించాలి. ఇన్ని చేసినా సరే పోయిన సెల్ ఫోన్ దొరుకుతుందనే గ్యారంటీ లేదు. అయితే పోగొట్టుకున్న ఫోన్ సింపుల్ గా రికవరీ చేసిపెడతామని పోలీసులు చెబుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పోగొట్టుకున్న సెల్ ఫోన్ వెతికిపెట్టేందుకు అనంతపురం పోలీసులు “చాట్ బాట్” పేరుతో డిఫరెంట్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. జస్ట్ వాట్సాప్ లో మెసేజ్ చేస్తే చాలని.. పోగొట్టుకున్న ఫోన్ ని రికవరీ చేసి, బాధితులకు అందజేస్తామని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప చెప్పారు. ఈ ‘చాట్ బాట్’ టెక్నాలజీని కొన్ని నెలల క్రితమే అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని కోసం ఏమేం చేయాలో కూడా వివరంగా చెప్పుకొచ్చారు.