నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి.. ఈ రాష్ట్ర అభివృద్ధికి నేనేం చేయాలో గైడ్ చేయండి! దేశంలోనే టాప్ మోస్ట్ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అనంత్ అంబానీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే కాదు, పారిశ్రామిక వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధ పథంలో పరుగులు పెట్టించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ ఉద్యానహబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.ఈ చరిత్రాత్మక ప్రాజెక్టులో దేశ ప్రసిద్ధ సంస్థ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ భాగస్వామ్యం కావడమే ఇక్కడి అసలు హైలైట్. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్‌లతో పాటు రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.”

ఇక సభలో అనంత్ అంబానీ మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ‘ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించి, రిలయన్స్‌పై నమ్మకం ఉంచినందుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అంతేకాదు.. ‘నన్ను ఎప్పుడూ ఒక ఆంధ్రా బిడ్డలాగే భావించండి. ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి నేనేం చేయాలో నాకు మార్గదర్శనం చేయండి’ అంటూ అనంత్ అంబానీ చేసిన వ్యాఖ్యలు సభలో ఉన్నవారందరినీ కదిలించాయి. ఆయన మాటలకు సీఎం చంద్రబాబుతో పాటు వేదికపై ఉన్న నాయకులందరూ ఫిదా అయిపోయారు. ఇక అనంత్ అంబానీ ప్రసంగం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు ఆయన్ను ఎంతో ఆప్యాయంగా అలింగనం చేసుకున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ కూడా అనంత్ అంబానీని అభినందించారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడంలో, పారిశ్రామిక దిగ్గజాలను రాష్ట్రం వైపు తిప్పుకోవడంలో సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహం ఏ స్థాయిలో పనిచేస్తుందో ఈ ఘటనే నిరూపిస్తోంది. రిలయన్స్ లాంటి గ్లోబల్ కంపెనీ రాయలసీమలో పెట్టుబడులు పెట్టడం వల్ల స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏపీలో మారుతున్న పారిశ్రామిక వాతావరణానికి, ప్రభుత్వ దార్శనికతకు ఈ ప్రాజెక్ట్ ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
