ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న జోరుగా ప్రచారానికి SEC గట్టి బ్రేక్ వేసింది. షెడ్యూల్ ప్రకటనకు మరో రెండు నెలల సమయం పడుతుందంటూ వస్తున్న వార్తలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తీవ్రంగా ఖండించారు. ఈ పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని, ప్రజలు, రాజకీయ పార్టీలు ఇలాంటి ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.
ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల కోర్టు కేసుల వల్లే ఎన్నికలు ఆలస్యమవుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని పునేఠా కొట్టిపారేశారు.
కమిషన్ పేరుతో కల్పిత సమాచారాన్ని సోషల్ మీడియాలో ఫార్వార్డ్ చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ హెచ్చరించింది.
ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి ఎలాంటి సమాచారమైనా అధికారిక ప్రెస్ కాన్ఫరెన్స్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే వెల్లడిస్తామని, వాట్సాప్ పుకార్లను నమ్మవద్దని సూచించారు.
ఇటీవలే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఉన్న అతిపెద్ద లీగల్ అడ్డంకి తొలగిపోయింది. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వార్డుల పునర్విభజన, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది.
