తమిళ సినిమాలు తెలుగులో రీమేక్ అవ్వటం అన్నది ఈనాటిది కాదు. కొన్ని దశాబ్ధాలుగా జరుగుతూ వస్తోంది. అయితే, ఇంటర్‌నెట్ సరిగా అందుబాటులో లేని కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. ముఖ్యంగా రీమేక్‌ల విషయంలో.. ఒకప్పుడు రీమేక్‌ను కూడా నేరుగా థియేటర్లలో చూసే వారు. అప్పుడు వారికి రీమేక్‌కు, మాతృకకు తేడా తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు వేరే భాష సినిమా తెలుగులో రీమేక్ అవ్వబోతోందని తెలిస్తే చాలు.. ఆ సినిమా తెలుగులో విడుదల అవ్వటానికి ముందే చూసేస్తున్నారు 50 శాతం మంది జనం. చూసేయ్యటమే కాదు! మాతృకతో పోల్చి రీమేక్‌ల తాట తీస్తున్నారు.
అలా చాలా సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయినప్పటికి రీమేక్‌ల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ ఓరి దేవుడా!’. ఈ సినిమా తమిళ ‘ఓ మై కడవులే’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. మాతృకను తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మారిముత్తునే ఈ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించారు. విక్టరీ వెంకటేష్, విశ్వక్ సేన్, మితిలా పాల్కర్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. మరి, తమిళంలో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? నటీ,నటులు ఎలా చేశారు? ఇంతకీ ఈ సినిమా హిట్టా?ఫట్టా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
అర్జున్( విశ్వక్ సేన్), అను( మితిలా పార్కర్) చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. మద్యం మత్తులో అర్జున్, అనుకు ఇచ్చిన మాట వల్ల.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయితే, ఈ పెళ్లి అర్జున్‌కు ఏమాత్రం ఇష్టం ఉండదు. బెస్ట్ ఫ్రెండ్ అయిన అనును తన భార్యగా ఊహించుకోలేకపోతాడు. ఆమెతో క్లోజ్‌గా ఉండలేకపోతాడు. ఇలా తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి. చివరకు విడాకులకు అప్లై చేసుకుంటారు. కోర్టులో విడాకుల విచారణ జరుగుతుండగా ఓ అపరిచిత వ్యక్తి(రాహుల్ రామకృష్ణ) అర్జున్‌ను పరిచయం అవుతాడు. అర్జున్ భవిష్యత్తును కళ్లకు కట్టినట్లు చెబుతాడు. ఈ నేపథ్యంలోనే అర్జున్ ఆ అపరిచిత వ్యక్తి సహాయంతో దేవుడి(విక్టరీ వెంకటేష్) దగ్గరకు వెళతాడు. ఇక, దేవుడి ఎంట్రీతో అర్జున్ కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనుతో అర్జున్ విడాకులు తీసుకుంటాడా? లేక ఆమెను అర్థం చేసుకుని ఆమెతోనే ఉండిపోతాడా? ఇంతకీ అర్జున్, అనుల జీవితంలో ఏం జరుగుతుందన్నదే మిగితా కథ.
బెస్ట్ ఫ్రెండ్స్ అయిన అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ, పెళ్లికి సంబంధించిన కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అలా వచ్చిన చాలా స్టోరీలు హిట్‌లుగా నిలిచాయి. దర్శకుడు అశ్వత్ పాత కథనే పాలిష్ పట్టి కొత్తగా తీర్చి దిద్దారు. తన స్క్రీన్ ప్లేతో సినిమాను అద్భుతంగా మలిచారు. సినిమా మొత్తం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. కథ యూనివర్శల్ లైన్ కాబట్టి.. రీమేక్‌లో పెద్దగా మార్పులు చేయలేదు దర్శకుడు. తమిళ మాతృకకు ఏవిధంగా తగ్గకుండా ‘ఓరి దేవుడా’ను తెరకెక్కించారు. సస్పెన్స్ ఎలిమెంట్ కారణంగా సినిమా ఎక్కడా బోర్‌కొట్టకుండా సాగుతుంది. హీరో,హీరోయిన్ల విషయానికి వస్తే.. తమిళంలో అశోక్ సెల్వన్, రితికా సింగ్ చేసిన పాత్రలో విశ్వక్ సేన్, మితిలా పార్కర్ ఒదిగిపోయారు. ఇద్దరి నటనా చాలా సహజంగా ఉంటుంది.
రీమేక్ సినిమా చూస్తున్న భావన అస్సలు కలగదు. మాతృకలోని ఎమోషన్స్‌ను అలాగే క్యారీ చేశారు. ఇక, తమిళంలో విజయ్ సేతుపతి చేసిన దేవుడి క్యారెక్టర్‌ను తెలుగులో విక్టరీ వెంకటేష్ నభూతో నభవిష్యతిగా చేశారు. ఫన్ మిళితమైన క్యారెక్టర్ కాబట్టి అదరగొట్టేశారు. ఈ సినిమాలో వెంకటేష్‌ది ఎక్స్‌టెన్‌డెడ్ కేమియో. సినిమా ప్రారంభంలో కొన్ని నిమిషాలు మాత్రమే ఆయన ఉంటారు. ఉన్న కొన్ని నిమిషాలు ప్రేక్షకులతో ఆపకుండా విజిల్స్ వేయించారు. కథను మలుపు తిప్పే పాత్ర కోసం వెంకటేష్ బెస్ట్ ఛాయిస్ అయ్యారు. దేవుడి శిష్యుడిగా రాహుల్ రామకృష్ణ కూడా చాలా బాగా నటించారు. సపోర్టింగ్ రోల్స్ చేసిన ఆశ భట్, మరళీ శర్మ తదితరులు తమ పాత్రలకున్న స్కోప్‌ను బట్టి నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ‘ఓరి దేవడా’ సినిమా గురించి ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్.
సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. ఈ సినిమాలోని చాలా పాటలు అద్భుతంగా గుండెను మీటే విధంగా ఉంటాయి. వాటిని వింటే తమిళ్ డబ్బింగ్ పాటల్లా అస్సలు అనిపించదు. ఇక, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మరో లెవల్ అని చెప్పొచ్చు. ముందుగానే చెప్పినట్లు కథ మొత్తం స్క్రీన్ ప్లే మీద నడుస్తుంది కాబట్టి.. అందుకు తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అవసరం. ఈ విషయంలో లియోన్ జేమ్స్‌కు నూటికి నూటొక్క మార్కులు వేయోచ్చు. విధు అయ్యన్న కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సినిమా మొత్తం ఓ మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ తరానికి అవసరమైన జీవిత సత్యాలు ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయి.
చివరి మాట: ‘ఓరి దేవుడా!’ ఓ మంచి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్.