ఇంటర్నెట్ యుగంలో అందరి జీవితాలు ఫుల్ బిజీగా మారిపోయాయి. ఉరుకుల పరుగుల ఈ లైఫ్‌లో ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేంత తీరిక, సమయం ఎవరికీ ఉండట్లేదు. ఈ మార్పుల వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.
ఇప్పుడు అందరిదీ ఉరుకుల పరుగల జీవితంగా మారిపోయింది. గత కొన్నేళ్లలో మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణం.. ఇలా ఎన్నో విషయాల్లో అనూహ్య మార్పులు వచ్చాయి. ఒక్కటనే కాదు చాలా విషయాల్లో తెలియకుండానే చాలా ఛేంజెస్ వచ్చేశాయి. ముఖ్యంగా లైఫ్ స్టయిల్‌లో ఈ తేడాలను ఎక్కువగా గమనించొచ్చు. ఆరోగ్యంపై అశ్రద్ధ, పనిలో బిజీగా ఉండటం, సరైన సమయానికి తినకపోవడం, వ్యాయామం చేయకపోవడం లాంటివి అనారోగ్యానికి కారణాలుగా చెప్పొచ్చు. జీవనశైలిలో వస్తున్న మార్పులతో కొత్త కొత్త వ్యాధులు.. దీర్ఘకాలిక సమస్యలతో సతమతమయ్యే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో ఈ సమస్య రోజురోజుకీ తీవ్రతరమవుతోంది. దీనికి మన హైదరాబాద్ సిటీ కూడా మినహాయింపేమీ కాదు.
టాటా 1ఎంజీ ల్యాబ్స్ సంస్థ షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించింది. భాగ్యనగరంలో ఉన్న వారిలో 76 శాతం మంది విటమిన్ – డీ లోపంతో బాధపడుతున్నారని పేర్కొంది. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలపై 1ఎంజీ సంస్థ చేసిన అధ్యయనంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. గుజరాత్‌లోని నగరాల్లో విటమిన్ – డీ లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందట. వడోదరలో 89 శాతం, సూరత్‌లో 88 శాతం, అహ్మదాబాద్‌లో 85 శాతం మంది ప్రజలు ఈ సమస్యతో సతమతమవుతున్నారట. హైదరాబాద్ లో 76 శాతం మంది విటమిన్ – డీ లోపంతో బాధపడుతున్నారట.
పెద్దవారితో పోలిస్తే యువతలో ఈ లోపం అధికంగా ఉండటం గమనార్హం. 25 ఏళ్లలోపు వారిలో 84 శాతం మంది, 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కుల్లో 81 శాతం మందిలో విటమిన్ – డీ ఉండాల్సిన స్థాయిలో లేదని టాటా 1ఎంజీ అధ్యయనంతో స్పష్టమైంది. ఇలాంటి అనారోగ్యాలకు మెట్రో సిటీల్లో పెరుగుతున్న అపార్ట్‌మెంట్ కల్చర్ కారణమని నిపుణులు చెబుతున్నారు. మహానగరాల్లో ఏసీ లేనిదే ఎవరూ బయటకు రావడం లేదు. సూర్యరశ్మి తగలకుండా.. ఇళ్లు, కళాశాలలు, కార్యాలయాల్లోనే ఎక్కువ సమయం గడుపుతుండటం వల్ల.. సరైన మోతాదులో విటమిన్ డీ అందడం లేదు.
అంతేకాదు నగర ప్రజలు సరైన శారీరక శ్రమ, వ్యాయమం చేయకపోవడం, ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం కూడా వారిలో విటమిన్ డీ లోపం ఏర్పడటానికి కారణంగా చెబుతున్నారు. శరీరంలో విటమిన్ – డీ లోపిస్తే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. బాడీలో కాల్షియం స్థాయిలు తగ్గిపోయి.. బోలు ఎముకల వ్యాధికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. సన్ షైన్ విటమిన్ గా చెప్పుకునే విటమిన్ – డీ లోపం వల్ల తీవ్రమైన అలసట, బలహీనత, ఎముకల్లో నొప్పి, బలహీనమైన కండరాలు, ఆలోచనా శక్తి తగ్గిపోవడం, తరచుగా ఎముకలు విరగడం, పగుళ్లు రావడం వంటి సింటమ్స్ కనిపిస్తాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుందంటున్నారు. ఇక, పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయని.. ఇన్సులిన్ మీద ప్రభావం పడుతుందని అంటున్నారు. శరీరానికి తగినంత ఎండ తగిలేలా చూసుకోవడం, వ్యాయామం చేయడం, బలమైన ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోవడం వల్ల దీని నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. సూర్యకాంతితో పాటు పలు ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా విటమిన్ – డీ లోపాన్ని పూరించొచ్చని చెబుతున్నారు. చేపలు, చీజ్, కోడిగుడ్లు, కాడ్ లివర్ ఆయిల్, పాలు, మష్రూమ్స్ తదితర ఆహారాలను తరచూ భోజనంలో తీసుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు.