భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న హిమాచల్ ప్రదేశ్ లో ఉస్మానియా ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులు వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారి సమాచారం తెలియక పోవడంతో కుటుంబసభ్యులు ఆందోలనకు గురవుతున్నారు.
ఈ ఏడాది రుతుపవనాల ఆగమనం కాస్త ఆలస్యమైనప్పటికి ప్రస్తుతం వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వాతావరణంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పులతో భారీ వర్షాలతో బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాదిలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్రమైన ధన, ప్రాణ నష్టాలను కలిగిస్తున్నాయి. అతిగా కురుస్తున్న వర్షాలతో వరదలు వచ్చి పురాతన భవనాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. వాహనాలు, మనుషులు వరదల్లో కొట్టుకుపోతున్నారు. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ వెళ్లిన ఉస్మానియా ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులు వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది. వారి ఫోన్లు కూడా స్విచ్చాఫ్ రావడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వాళ్ల ఆచూకి కనిపెట్టాలని అధికారులను కోరుతున్నారు.
గత రెండు మూడు రోజుల నుంచి హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో హిమాచల్ వెళ్లిన ఉస్మానియాకు చెందిన ముగ్గురు డాక్టర్లు మనాలిలో వరదల్లో చిక్కుకున్నారు. వారి ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరదల్లో చిక్కుకున్న డాక్టర్లకు సంబందించిన వివరాలు ఇలా.. డాక్టర్ బానోత్ కమల్ లాల్, డాక్టర్ రోహిత్ సూరి, డాక్టర్ శ్రీనివాస్ గా తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై తెలంగాణ డాక్టర్ల సంఘం స్పందించింది. డాక్టర్ల ఆచూకీ కోసం ఢిల్లీ రెసిడెంట్ కార్యాలయాన్ని సంప్రదించింది. మరోవైపు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వరదల్లో చిక్కుకున్న వైద్యుల గురించి ఆరా తీశారు. వైద్యులను సురక్షితంగా రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనికి సబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.