హైదరాబాద్ నగరంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పంద్రాగస్టు వేడుకలను అవకాశం చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పర్యటక ప్రాంతాల్లో, ప్రముఖల నివాసం ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచారు.
75వ స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఉగ్రదాడుల పాల్పడే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ అధికారులు అన్ని రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో తెలంగాణ పోలీసులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అవకాశం చేసుకుని లష్కరే తొయిబా, జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు దేశంలోని ప్రధాన నగరాల్లో దాడులు చేసేందుకు ప్రణాళిక వేస్తున్నాయని కేంద్ర నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు అన్ని రాష్టాల పోలీసులకు హెచ్చరికలు పంపాయి.
ఇంటిలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పర్యాటక ప్రాంతాలు, ప్రముఖులు ఉండే ప్రదేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, ఇతర రద్దీ ప్రదేశాల్లో నిఘా ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే తనిఖీలు చేపడుతున్నారు. ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండి..అనుమానస్పదంగా ఎవరైన కనిపిస్తే తమ ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.
ముఖ్యంగా ఆగస్టు 15వ తేదీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో జరిగిన ఉగ్రదాడులను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి తప్పు జగరకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈనెల 30 వరకు హై అలర్ట్ కొనసాగుతుందని అధికార వర్గాలు ప్రకటించాయి.