తెలంగాణ వ్యాప్తంగా మోదీ వ్యాఖ్యలకు నిరసనగా.. టీఆర్ఎస్ ఆందోళనలకు సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా 2022, ఫిబ్రవరి 09వ తేదీ బుధవారం నల్లజెండాలతో నిరసన తెలుపుతున్నారు. తాజాగా జనగామలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. అయితే, ఆ ర్యాలీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కర్రలతో ఇరు వర్గాల మద్య దాడులు కూడా జరిగాయి. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులను భారీగా మోహరించి గొడవను సర్ధుమణిగేలా చేశారు.
కాగా, ఏపి విభజన సరైన పద్ధతిలో జరగలేదంటూ రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారాన్ని లేపాయి. అయితే ప్రధాని మోదీ కాంగ్రెస్ ని ఉద్దేశించిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.
తెలంగాణను అవమానించేలా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజనపై అసందర్భంగా మాట్లాడి మోదీ తప్పు చేశారని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. బీజేపీని టార్గెట్ చేస్తూ.. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. అసలు ఏడున్నరేళ్లలో రెండు రాష్ట్రాలకు ఏం చేశారని నేతలు ప్రశ్నిస్తున్నారు. వీటికి కౌంటర్‌గా బీజేపీ నేతలు రంగంలోకి దిగడంతో హీట్ పీక్స్‌కు చేరుకుంది.