ఇంజినీరింగ్ అంటే సాఫ్ట్‌వేర్ మాత్రమే అన్నట్టుగా పరుగులు తీస్తున్న రోజులివి. బీటెక్ పూర్తై ఖాళీగా ఉన్నారా!.. ఏం జాబ్ చేయట్లేవా, జాబ్ సర్చింగ్ హా అంటూ రోజుకొకరు ప్రశ్నిస్తుంటారు. ఊరికి 10 పది మంది నిరుద్యోగ ఇంజినీర్లు ఉండటమే ఈ పరిస్థితికి కారణం. ఏదో ఒక డిగ్రీ ఉండాలని చదివే వారు కొందరైతే, ఫీజు రీయింబర్సుమెంట్ ఉంటది, మనం కట్టాల్సిన అవసరం ఉండదు అని బీటెక్ చదివే వారు మరికొందరు. కానీ, ఈ యువకుడు అందరిలా కాదు.. ఈ-వాహనాల సమస్యలు భయపెడుతున్న ఈరోజుల్లో తన ఆవిష్కరణ అందుకు పరిష్కారం చూపుతుందంటూ సరికొత్తగా ఎలక్ట్రిక్ బైకును సృష్టించాడు. ఆ వివరాలు..
కరీంనగర్ జిల్లా ముంజంపల్లికి చెందిన కాసం అఖిల్ రెడ్డి అనే యువకుడు పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సీటీ నుంచి ఆటోమొబైల్ విభాగంలో పట్టా పొందాడు. అఖిల్‌కు చిన్ననాటి నుంచి వాహనరంగం అంటే విపరీతమైన మక్కువ. చిన్నప్పుడు ఏవైనా బొమ్మలు కొనిచ్చినా, వాటిని విడమరిచి మళ్లీ కలిపేవాడు. తన ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు ఆ దిశగానే ప్రోత్సహించారు. అందుకే.. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఎంచుకున్నాడు. డిగ్రీ పూర్తయ్యాక, ఏదో ఒక నూతన ఆవిష్కరణ చేయాలని కలలు కనేవాడు. ఆ సమయంలో తన తండ్రి పొలానికి వెళ్లడానికి పడుతున్న ఇబ్బందిని గమనించి అందుకు పరిష్కారం చూపాలనుకున్నాడు. ఎలక్ట్రిక్ బైకును తయారు చేయించి ఇవ్వాలనుకున్నాడు.
వెంటనే స్ప్లెండర్ బైక్‌ను ఒక దానిని ఎంచుకొని, రాత్రి పగలు శ్రమించి 3 రోజుల్లో దానిని ఎలక్ట్రిక్ వాహనంగా మార్చాడు. అప్పుడే మరో ఆలోచన తన మదిని తట్టింది. ఈ-బైకులు కాలిపోతున్న ఘటనలు ఎక్కువుగా చోటుచేసుకుంటుండడంతో మళ్లీ దానిపై ఆలోచన చేశాడు. ఎక్కువ వేడి ఉత్పత్తి అయినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, తయారు చేసే సమయంలో టెఫ్లాన్ షీట్లు వాడాడు. ఇది ఎక్కువగా ఉత్పత్తి అయిన వేడిని తగ్గిస్తుంది. దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువంటున్నాడు.
వాహన తయారీకి వాడిన పరికరాలు, వాహన పనితీరు గురించి అతని మాటల్లో.. “స్ప్లెండర్ బైక్‌ను ఈ-బైక్‌గా మార్చాను. 100 స్పీడ్ వరకు వెళ్తుందుకున్నా.. కానీ 65 నుంచి 70 వరకు మైలేజ్ ఇస్తోంది. ఒకసారి ఛార్జ్ చేస్తే.. 25 రూపాయలు పడుతుంది. ఈ బైక్‌ను వేసవిలో 50 డిగ్రీల ఎండలో మూడ్రోజుల పాటు పెట్టాను ఎలాంటి సమస్యలు రాలేదు. అలాగే.. వానలో, చలిలో కూడా ఉంచాను. ఏ సమస్యా లేదు. దీనిని ఇంకా రెండేళ్లు వాడిన తర్వాత పనితీరు చూసి ఇంకా కొన్నిమార్పులు చేసి ఆ తర్వాత మార్కెట్‌లోకి తీసుకొస్తాను.. ” అని అఖిల్ చెప్పుకొచ్చాడు. ఇతని పట్టుదల, ఆవిష్కరణపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.