మరి కొద్దిరోజుల్లో ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. బీసీసీఐ అధికారికంగా టీ20 టీమ్ ఇండియా జట్టుని ప్రకటించింది. ఈ జట్టులో అనూహ్యంగా శుభమన్ గిల్ చోటు దక్కించుకోవడమే కాకుండా వైస్ కెప్టెన్ బాధ్యతలు తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. గిల్ ఎంపిక వెనుక ఎవరి హస్తముందనే ప్రచారం గట్టిగా నడుస్తోంది.
ఆసియా కప్ 2025 యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 28 వరకు జరగనుంది. ఈ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ సహా 8 జట్లు పాల్గొంటున్నాయి. బీసీసీఐ ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్వయంగా సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో 15 మందితో కూడిన టీమ్ ఇండియాను ప్రకటించాడు. అయితే దాదాపు ఏడాదిగా టీ20కు దూరంగా ఉన్న శుభమన్ గిల్‌ను అనూహ్యంగా వైస్ కెప్టెన్ చేశారు. ఇదే అందర్నీ ఆశ్చర్యపర్చింది. అయితే గిల్ ఎంపిక వెనుక అజిత్ అగార్కర్ హస్తముందని చాలా మంది భావించారు. కానీ వాస్తవం మరోలా ఉంది. గిల్ ఎంపికనేది అజిత్ అగార్కర్ ఛాయిస్ కానేకాదట.
గిల్ ఎంపిక వెనుక గంబీర్ హస్తం
బీసీసీఐ సెలెక్టన్ కమిటీ బేటీకు వర్చువల్ ద్వారా హాజరైన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచనల మేరకే శుభమన్ గిల్‌ను ఎంపిక చేశారనే వార్తలు విన్పిస్తున్నాయి. లేకపోతే అక్షర్ పటేల్‌కే ఆ బాధ్యతలు అప్పగించేవారట. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని శుభమన్ గిల్‌ను ఆసియా కప్ టీమ్ ఇండియా జట్టుకు వైస్ కెప్టెన్ చేశారని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే శుభమన్ గిల్ టెస్ట్ కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ తరువాత వన్డే బాధ్యతలు కూడా ఇతనికే అప్పగించనున్నారు. ఇప్పుడు టీ20 అనుభవం ఉంటే సూర్యకుమార్ యాదవ్ విఫలమైతే గిల్ ప్రత్యామ్నాయం కావచ్చు. ఇదే ఆలోచనతో ఇప్పట్నించే గిల్ వెనుక గంభీర్ నిలిచాడట.
అందుకే శ్రేయస్ అయ్యర్‌ను తప్పించారా
శుభమన్ గిల్ దాదాపు ఏడాదిగా టీ20 ఫార్మట్‌కు దూరంగా ఉన్నాడు. అదే సమయంలో ఐపీఎల్ 2025, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ఛాంపియన్స్ ట్రోఫీల్లో అద్భుతమైన ఆటుతీరు కనబర్చిన శ్రేయస్ అయ్యర్‌కు స్థానం లభించకపోవడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఇదే విషయాన్ని మీడియా ప్రశ్నించినప్పుడు శ్రేయస్ అయ్యర్ ఆటతీరులో ఎలాంటి లోపం లేదని స్వయంగా అజిత్ అగార్కర్ చెప్పడం గమనార్హం. మరి అలాంటప్పుడు ఎందుకు తప్పించారనేది బీసీసీఐ సెలెక్టర్లకే తెలియాలి.