అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యలయంతో పాటు, విజయవాడలోని తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి ఇంటిపై, హిందూపురంలోని బాలకృష్ణ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. అటు విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
సీఎం జగన్ పై తెలుగుదేశం నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం చెందిన వైసీపీ కార్యకర్తలు ఈ దాడులు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై జరిగిన దాడులపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. వెంటనే దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయకపోతే భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరచకానికి అడ్రస్ అవుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయాలపై దాడులు జరగడం ఇదే మొదటిసారి అని పవన్ అన్నారు. రాష్ట్రంలో ఇలాంటి దాడుల సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం క్షేమకరం కాదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అందరూ సంయమనం పాటించాలని ఆయన సూచించారు. వ్యక్తిగత, పార్టీ ఆఫీసులు, నాయకుల ఇళ్లపై దాడులు చేయడం అరాచకానికి దారులు ఏర్పరచడమేనని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
ఈ దాడుల ఘటనలపై కేంద్ర హోం శాఖ, ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయన్న సమాచారం తనకుందని, ఒకవేళ నిజంగా ఈ దాడులకు పాల్పడింది వైసీపీ వారే అయితే, ఇలాంటి పోకడులు నియంత్రించుకోక పోతే మీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారతారని పవన్ కళ్యాణ్ అన్నారు.