శంషాబాద్- రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని శ్రీరామ నగరంలో జరుగుతున్న శ్రీ రామానుజా చార్యుల వారి సహస్రాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజు ఉత్సవాల్లో భాగంగా అష్టాక్షరీ మంత్రి పఠనం, శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం, వైభవేష్టి, శ్రీరామ అష్టోత్తర శతనామావళి పూజ, పరమేష్టి యాగం, ప్రవచన తదితర కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.
శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్యవాల్లో సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సమతా మూర్తి విగ్రహంతో పాటు, 108 దివ్య దేశాల ఆలయాలను ఆయన దర్శించుకున్నారు. చినజీయర్ స్వామికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేశారు. చినజీయర్ స్వామి మహాసంకల్పం వల్లే ఇదంతా సాధ్యమైందని ఈ సందర్బంగా అన్నారు.
సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన భారత ప్రధాని మోదీ నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. సమతా మూర్తి శ్రీ రామానుజల వారి 216 అడుగుల విగ్రహం వద్దకు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇంత ఎత్తులో సమతా మూర్తి విగ్రహం స్థాపించడం చినజీయర్ స్వామి మహా సంకల్పానికి నిదర్శనమని పవన్ కళ్యాణ్ అన్నారు.
వెయ్యేళ్ల చరిత్ర కలిగిన రామానుజ విగ్రహాన్ని రాజకీయాలకు అతీతంగా ఆవిష్కరించే అర్హత ప్రధాని మోదీకే చెందుతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మొత్తం 108 దివ్య ఆలయాలు ఒకే చోట ఉండటం చాలా గొప్ప విషయమని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ దివ్యక్షేత్రం భాగ్యనగరానికి సరికొత్త శోభ తీసుకొచ్చిందని, హైదరాబాద్ ఆధ్యాత్మిక రాజధానిగా మారనుందని పవన్ అన్నారు.