దేశ రాజధాని ఢిల్లీ వరద గుప్పిట్లో చిక్కుకుంది. యమునా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చొచ్చుకొచ్చేసింది. స్కూళ్లు, ఆఫీసులు మూతపడ్డాయి. యమునా నది వరద ఉధృతి వివరాలు ఇలా ఉన్నాయి.
యమునా నది పోటెత్తుతోంది. ప్రమాదకరస్థాయి దాటి ప్రవహిస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్ని వరదు ముంచెత్తింది. రహదారులు వాగులుగా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలైతే పూర్తిగా జలమయమవడంతో జనజీవనం స్థంబించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం యమున నది నీటి మట్టం ప్రమాద స్థాయిగా పిలిచే 205.33 మీటర్లు దాటేసింది. సాయంత్రానికి 206.50 మీటర్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గురుగ్రామ్‌లో నిన్న ఒక్క రోజే 100 మిల్లీమీటర్ల వర్షపాతం కురవడంతో ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే వంటివి నీటిలో మునిగాయి.
యమునా నది ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో యమునా నగర్ జిల్లా హత్నికుండ్ బ్యారేజ్ గేట్లను ఎత్తివేశారు. ఆఫీసులు, స్కూళ్లు మూతపడ్డాయి. సెప్టెంబర్ 5 వరకు క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని హర్యానా ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. ప్రజలు కూడా ఆందోళన చెందవద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కోరారు. సెప్టెంబర్ 4 వరకూ భారీ వర్షాలు ఉండటం వల్ల వరద పెరిగే పరిస్థితి ఉంది. అందుకే ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేయాలని ప్రభుత్వ యంత్రాంగం కోరింది.