మాటలకందని మహా విషాదం. మొదటి పుట్టినరోజే ఆ చిన్నారికి చివరి రోజుగా మారింది. హ్యాపీ బర్త్ డే కాస్తా అందరికీ డెత్ డే అయింది. మహా ఘోరానికి చిన్నారి సహా 15 మంది మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముద్దుల కుమార్తె తొలి పుట్టిన రోజు వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. బంధువులు, సన్నిహితులతో సంతోషంలో ఉండగా ఒక్కసారిగా భవనం కూలింది. బర్త్ డే బేబీతో సహా 15 మంది మరణించారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వాసాయి విరార్ లో జరిగిన ఘోరమిది. ఆగస్టు 27 చిన్నారి ఉత్కర్ష జోయల్ మొదటి పుట్టిన రోజు. ముద్దుల కుమార్తె మొదటి బర్త్ డే కావడంతో అత్యంత ఘనంగా చేయాలనుకున్నారు తల్లిదండ్రులు ఓంకార్ జోయల్, ఆరోహి జోయల్. బంధుమిత్రుల్ని, సన్నిహితుల్ని అందర్నీ పిలిచారు. కేక్ కట్ చేసి ఫోటోలు దిగారు. డిన్నర్ దాదాపుగా పూర్తి చేశారు. అప్పటికే రాత్రి 11.30 గంటలైంది. అంతలో ఒక్కసారిగా ఆ నాలుగు అంతస్థుల రమబాయి అపార్ట్ మెంట్ వెనుక భాగం కుప్పకూలిపోయింది. బర్త్ డే వేడుకలు డెత్ డేగా ముగిశాయి. చిన్నారి ఉత్కర్ష సహా 15 మంది మరణించారు. తండ్రి ఓంకార్ జోయల్ ఆచూకీ ఇంకా తెలియలేదు.
భారీ వర్షాలే కారణమా
ఈ భవనం 13 ఏళ్ల క్రితం నిర్మించినట్టు తెలుస్తోంది. ఇందులో 40 ఫ్లాట్లు ఉన్నాయి. దాదాపు 30 గంటల నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పునాదులు దెబ్బతిని ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం శిధిలాలు తొలగించే పని జరుగుతోంది. పూర్తిగా తొలగిస్తేనే కానీ కచ్చితంగా ఎంతమంది మరణించారనేది తెలియవచ్చు. ఈ అపార్ట్ మెంట్ నిర్మాణం కూడా అక్రమంగా నిర్మించిందని తెలుస్తోంది.