పంద్రాగస్టు వేడుకలు సమీపిస్తున్నాయి. దేశం మొత్తం 79వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునేందుకు సిద్ధమైంది. దేశ స్వాతంత్య్రంలో కీలకపాత్ర పోషించిన మహాత్మాగాంధీ త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయడానికి నిరాకరించాలంటే నమ్మగలరా…కానీ ఇదే నిజం. అసలేం జరిగింది.
ఆగస్టు 15. ఈసారి దేశం మొత్తం 79వ ఇండిపెండెన్స్ డే జరుపుకోనుంది. దేశ స్వాతంత్య్రోద్యమం, జాతీయ జెండా గురించి ఇప్పటి జనరేషన్‌కు తెలియని అంశాలు ఎన్నో ఉన్నాయి. కీలకమైన ఘటనలు కూడా ఉన్నాయి. ఆ విషయాలు వింటుంటే ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంది. మరి కొన్ని ఘటనలైతే నమ్మలేనివిగా ఉంటాయి. అలాంటిదే ఇది.
భారతదేశ త్రివర్ణ పతాకానికి జాతిపిత మహాత్మా గాంధీ సెల్యూట్ చేయడానికి ఓసారి నిరాకరించారట. ఈ విషయం మీకు నమ్మలేనిదిగా ఉన్నా ముమ్మాటికి నిజమిది. దీనివెనుక ఆయనకు కొన్ని అభ్యంతరాలున్నాయి. ఆ అభ్యంతరాలపై సందేహాలపై సమాధారం లభించాకే ఆయన సెల్యూట్ చేసేందుకు అంగీకరించారు. వాస్తవానికి ఇప్పుడున్న మువ్వన్నెల జెండా మధ్యలో కన్పించే అశోక చక్రం స్థానంలో గతంలో స్వదేశీ ఉద్యమంలో కీలకమైన చరఖా ఉండేది. 1947లో చరఖా స్థానంలో అశోక చక్రం చేర్చారు.
గాంధీజీ అసంతృప్తికి కారణమేంటి
జెండాలో మార్పులు చేసే సమయంలో గాంధీజీ లాహోర్‌లో ఉన్నారు. రాజ్యాంగ సభలోని కొందరు కాంగ్రెసేతర సభ్యులు చరఖా అనేది కాంగ్రెస్ పార్టీకు చిహ్నమని, జాతీయ జెండాలో వద్దని వాదించి ఆ స్థానంలో అహింస-ధర్మానికి చిహ్నమైన అశోక చక్రం చేర్చారు. ఇదే గాంధీజీ అసంతృప్తికి కారణమైంది. సెల్యూట్ చేయనంటూ బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశారు. చరఖా అనేది కేవలం నూలు వడికే యంత్రం కాదని, ఎందరో పేదలకు ఉపాధి, ఆదాయం సమకూర్చిందని, మానవత్వం, సరళతకు చిహ్నమని గాంధీజీ భావించారు. అయితే జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలిసి గాంధీజీని కన్విన్స్ చేశారు. దాంతో కొత్త డిజైన్‌కు గాంధీజీ ఆమోదం తెలుపడంతో 1947, జూలై 22న రాజ్యాంగ సభ త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా ఆమోదించింది. ఆ తరువాత ఆగస్టు 15, 1947లో తొలిసారిగా స్వతంత్ర భారతదేశంలో ఇదే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.