ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా కొత్త కొత్త వేరియంట్లతో విజృంభిస్తుంది. ఇప్పటికే డెల్టా వేరియంట్ తో సతమతమైన ప్రజలకు ఇప్పుడు ‘ఒమిక్రాన్ వేరియంట్’ తో ముప్పు పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’పై భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ వైరస్ క్రమంగా ప్రపంచదేశాలకు విస్తరిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే ఒమిక్రాన్ 20 దేశాలకు పాకినట్లు నివేదికలు చెబుతున్నాయి. అత్యంత వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందనే వైద్య నిపుణుల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఇటీవల భారత్ లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య 9,765గా నమోదయిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో కొత్తగా 8,548 మంది కరోనా నుంచి బయటపడగా, 477 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.మొత్తం కేసుల సంఖ్య 3,46,06,541కి చేరింది. ఇందులో 3,40,37,054 మంది కోలుకోగా, 4,69,724 మంది మృతిచెందారు. మరో 99,763 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 1,24,96,19,515 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, ఇందులో బుధవారం ఒకేరోజు 80,35,261 మంది టీకా ఇచ్చామని తెలిపింది.