టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్యకాలంలో విలక్షణమైన పోస్టులతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అదే సమయంలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతి సందర్భంలోనూ టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ భుజంపై తుపాకీతో ప్రధాని మోదీకి గురి పెట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా కన్నడ, తమిళ, హిందీ రంగాల్లో ప్రత్యేకత నిలుపుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. బీజేపీకు బద్ధవిరోధి అయిన ఈయన తరచూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు సంధిస్తుంటారు. అదే క్రమంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకే ఏమో ఒకప్పటి మిత్రుడైన పవన్ కళ్యాణ్‌పై కూడా వ్యంగ్యాస్త్రాలు విసురుతుంటారు. ఇప్పుడు మరోసారి ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ భుజంపై తుపాకీ ఉంచి ప్రధాని మోదీకి గురి పెట్టారు. అసలేం జరిగిందో చూద్దాం..
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా పీఎం రిమూవల్ బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి లేదా కేంద్ర మంత్రులు ఎవరైనా సరే ఐదేళ్ల జైలు శిక్ష పడే కేసులో అరెస్ట్ అయి కనీసం 30 రోజులుంటే ఆ పదవి కోల్పోవల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. ఈ బిల్లుపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రధాని మోదీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓ ప్రభుత్వోద్యోగి అవినీతి కేసులో 50 గంటలు జైళ్లో ఉంటే ఉద్యోగం పోతున్నప్పుడు అదే రూల్ రాజకీయ నేతలకు ఎందుకు వర్తించకూడదని ప్రశ్నించారు. ఇకపై జైళ్ల నుంచి పాలించే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.
ఈ బిల్లుని ఉద్దేశించే ప్రకాష్ రాజ్ తాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ఏపీ రాజకీయాలకు అన్వయించారు. ఎక్స్ వేదికగా సెటైర్ వేశారు. ఒక చిలిపి సందేహం..మహా ప్రభు..తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక మాజీ ముఖ్యమంత్రి లేదా ప్రస్తు ముఖ్యమంత్రి మాట వినకుంటే అరెస్టు చేసి మీ మాట వినే ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా అంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
ఒక చిలిపి సందేహం
మహాప్రభు .. తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక , మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, “మీ మాట వినె ఉపముఖ్యమంత్రిని” ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా ??? #justasking #newbill #parliament pic.twitter.com/3sbPGazzGj
— Prakash Raj (@prakashraaj) August 22, 2025
పవన్ కళ్యాణ్ భుజంపై తుపాకీ…గురి మోదీకు
ప్రకాశ్ రాజ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ భుజంపై తుపాకీ పెట్టి మోదీని టార్గెట్ చేశారు. ఏపీలో ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరిపై కొన్ని కేసులున్నాయి. ఇద్దరూ బెయిల్‌పై ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ లేని పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చేసే ఉద్దేశ్యం ప్రధానికి ఉందా అంటూ కూటమి పార్టీల్లో కొత్త సందేహాలు లేవనెత్తారు.