బాలీవుడ్ ఒకప్పటి అగ్ర హీరో గోవిందా గురించి తెలియనివాళ్లుండరు. ఖాన్స్ అండ్ కపూర్స్ రాజ్యమేలుతుండగానే తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు 62 ఏళ్ల వయస్సులో లైంగిక వేధింపులు, వ్యభిచార ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అది కూడా భార్య నుంచి..
సినిమా పరిశ్రమలో ఎవరు ఎప్పుడు విడాకులు తీసుకుంటారనేది ఊహించలేరు. విడాకులు, రిలేషన్ షిప్ ఇక్కడ కామన్. ఒక్కోసారి నిజం లేకపోయినా పుకార్లు మాత్రం షికారు చేస్తుంటాయి. తాజాగా ఓ స్టార్ హీరో గురించి వస్తున్న వార్తలే ఆందోళన రేపుతున్నాయి. బాలీవుడ్‌లో ఖాన్ అండ్ కపూర్స్ హవా నడుస్తున్న సమయంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి నిలదొక్కుకోవడమే కాకుండా ఓ ఊపు ఊపిన నటుడు గోవిందా. తనదైన శైలిలో డ్యాన్స్, కామెడీ, యాక్షన్ చేయడం ఆ నటుడి ప్రత్యేకత. ఇప్పుడు 62 ఏళ్ల వయస్సులో ఈ అగ్ర హీరోపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ వయసులో రాసలీలలంటూ విమర్శలు విన్పిస్తున్నాయి.
1987లో సునీత అహుజాను పెళ్లి చేసుకున్న గోవిందా చాలా కాలానికి భార్యను అధికారికంగా ప్రకటించాడు. అయితే ఆ తరువాత ఇద్దరూ ఆనందంగా 37 ఏళ్ల వివాహ బంధం దాటేశారు. ఇద్దరు సంతానం కూడా. ఇప్పటికీ ఫిట్‌నెస్ మెయింటైన్ చేసే గోవిందా వర్సెస్ సునీత మధ్య బంధం సరిగ్గా లేదని తెలుస్తోంది. వాస్తవానికి గత ఏడాది అంటే 2024లో ఈ ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. ఇది వాస్తవం కూడా. అయితే ఆ తరువాత ఇద్దరి మధ్య రాజీ జరగడంతో కలిసి జీవించసాగారు.
ఇప్పుడు మరోసారి విడాకుల అంశం తెరపైకి వచ్చింది. సునీత ఈసారి నిజంగానే విడాకులు తీసుకోనుందని తెలుస్తోంది. ఇప్పుడిక పిటీషన్ ఉపసంహరించుకోదని, విడాకులు కచ్చితంగా తీసుకుంటుందని అంటున్నారు. ఎందుకంటే ఈసారి సునీత..గోవిందాపై చాలా షాకింగ్ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలే ఇప్పుడు బాలీవుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. అందరూ అవాక్కవుతున్నారు. 37 ఏళ్ల వివాహ బంధం తరువాత సునీతా అహుజా..గోవిందాపై లైంగిక వేధింపులు, మోసం, వ్యభిచారం ఆరోపణలు పెడుతోంది. మరాఠీ చిత్ర పరిశ్రమలోని ఈ యువ హీరోయిన్‌తో గోవిందా గత కొద్దికాలంగా రిలేషన్ షిప్ నడుపుతున్నారని అందుకే భార్యాభర్యల మధ్య చిచ్చురేగిందనేది బాలీవుడ్ మీడియాలో విన్పిస్తున్న వార్త.
విడాకులు నిజమేనా
అయితే గోవిందా మేనేజర్ మాత్రం ఈ వార్తలు నిరాధారమని ఖండించారు. ఇద్దరి మధ్య విబేధాలు నిజమే అయినా విడాకులు తీసుకునేంత పెద్దవి కావని తెలిపారు.. ఇద్దరి సమస్యల్ని ఇద్దరూ స్వయంగా పరిష్కరించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని గోవిందా మేనకోడలు ఆర్తి సింగ్ కూడా ధృవీకరించింది. తప్పుడు వార్తలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించవద్దని కోరుతోంది.