మహిళలపై వేధింపుల కేసులు ఇప్పుడు కేరళలో కలకలం రేపుతున్నాయి. మాజీ జర్నలిస్టు అండ్ స్టార్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మని వేధిస్తున్నాడంటూ ఈమె చేసిన వ్యాఖ్యలపై రాజకీయ ప్రకంపనలు రాజుకున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మలయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల కేసు రోజురోజుకూ తీవ్రమౌతోంది. ప్రభుత్వం నియమించి హేమ కమిటీ నివేదికతో సెలెబ్రిటీలు ఒక్కొక్కరిగా తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. తాజాగా మాజీ జర్నలిస్టు అండ్ స్టార్ నటి రిని ఆన్ జార్జ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి. ఓ యువ ఎమ్మెల్యే తనను హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడని రినీ ఆన్ జార్జ్ ఆరోపించింది. ఫైవ్ స్టార్ రూమ్ బుక్ చేసాను రమ్మంటూ అభ్యంతరకరమైన మెస్సేజీలు పంపిస్తున్నాడని వాపోయింది. అయితే ఆ ఎమ్మెల్యే పేరు గానీ, పార్టీ గానీ బహిర్గతం చేయలేదు. భద్రతా పరంగా ఆ పేరు వెల్లడించలేనని చెప్పింది.
ఈ ఎమ్మెల్యే నుంచి తనకు వేధింపులు కొత్త కాదని..మూడేళ్ల నుంచి నడుస్తోందని తెలిపింది. ఈ మధ్యన అతని ప్రవర్తన మరీ శృతి మించుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. అతని ప్రవర్తనపై ఆ పార్టీ సీనియర్ నేతలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని చెప్పింది. నేనెవరికీ భయపడేది లేదు…ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బరి తెగిస్తున్నాడని రినీ ఆన్ జార్జ్ పేర్కొంది.
ఎవరా ఎమ్మెల్యే…
ఎప్పుడైతే రినీ ఆన్ జార్జ్ ఈ వ్యాఖ్యలు చేసిందో కేరళలోని బీజేపీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఆరోపణలు సంధిస్తోంది. ఆ యువ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకు చెందిన రాహుల్ మమ్కూతతిల్ అని చెబుతోంది. ఎందుకంటే గతంలో ప్రముఖ రచయిత్రి హనీ భాస్కరన్ కూడా ఈ ఎమ్మెల్యేపై ఈ తరహా ఆరోపణలు చేసింది. బయటకు చెప్పుకోలేని మెస్సేజీలతో వేధించేవాడని బీజేపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు రినీ ఆన్ జార్జ్ , గతంలో హనీ భాస్కరన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్ మాత్రం కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.