ఇప్పుుడు అందరి దృష్టీ రిషభ్ శెట్టి సృష్టించిన కాంతారా ప్రీక్వెల్‌పై పడింది. ఈ ఏడాది 1000 కోట్లు వసూలు చేసే మొదటి సినిమా ఇదే కావచ్చనే అంచనాలున్నాయి. నిజంగా కాంతారాకు అంత దమ్ముందా..పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ ఏడాది అంటే 2024 సూపర్ హిట్ సినిమాలు చాలానే ఉన్నాయి. 200 నుంచి 500 కోట్ల వరకూ వసూళ్లు జరిపాయి. ఇదే ఏడాది ప్రారంభంలో బాలీవుడ్ సినిమాలు ఛావా, సైయారా 500 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డు సృష్టించాయి. ఏ మాత్రం అంచనాల్లేని యానిమేటెడ్ సినిమా మహావతార్ నరసింహ ఊహించని రీతిలో 300 కోట్లకు చేరువుతోంది. ఇక అమీర్ ఖాన్ సినిమా సితారే జమీన్ పర్, అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం, ఎంపూరన్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అయితే ఈ ఏడాది ఏ సినిమా కూడా 1000 కోట్లకు చేరువ కాలేదు. ఇది బహుశా ఇక కష్టం కూడా.
ఇటీవల విడుదలైన కూలీ, వార్ 2పై భారీ అంచనాలు నెలకొన్నా భారీ కలెక్షన్లు సాధించలేకపోతున్నాయి. ఇప్పటికి ఇంకా ఈ రెండు సినిమాలు 300 కోట్లు వసూలు చేశాయి. ఇక ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలున్నా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ, బాలయ్య సినిమా అఖండ 2లు కూడా సెప్టెంబర్‌లో విడుదల కానున్నాయి. వీటిపై కూడా భారీ అంచనాలున్నా కలెక్షన్లు వేయి కోట్లుంటాయా అనేది అనుమానమే.
కాంతారా ప్రీక్వెల్ 1000 కోట్లు సాధిస్తుందా
ఈ క్రమంలో అందరి దృష్టీ కాంతారా ప్రీక్వెల్‌పై ఉంది. రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య నటించిన మైథలాజికల్ యాక్షన్ డ్రామా ఇది. అక్టోబర్ 2న విడుదల కానుంది. దేశంలోని దాదాపు అన్ని భాషల్లో కాంతారా సినిమాకు ఉన్న డిమాండ్ నేపధ్యంలో 1000 కోట్లు కలెక్షన్లు సాధిస్తుందనే నమ్మకం నిర్మాతల్లో ఉంది. హిందీ బాక్సాఫీసు కలెక్షన్లలో సీక్వెల్ సినిమాలకు భారీ వసూళ్లు సాధించిన చరిత్ర ఉంది. పుష్ప 2, స్త్రీ 2, కేజీఎఫ్ అన్నీ కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలే. అందుకే ఇప్పుడు కాంతారా ప్రీక్వెల్‌పై చాలా అంచనాలున్నాయి. మరి ఈ సినిమా 1000 కోట్లకు చేరుతుందో..ఆగిపోతుందో చూడాలి. ఒక్క ఏపీ, తెలంగాణలోనే ఈ సినిమా హక్కులకు నిర్మాతలు 100 కోట్లు కోట్ చేస్తున్నారని సమాచారం.