సినిమా ఇండస్ట్రీలో బోర్న్ విత్ గోల్డ్ స్పూన్ అంటూ ఏదీ ఉండదు. ఒకవేళ ఉన్నా మొదట్లోనే ఉంటుంది. ఆ తరువాత కష్టపడాల్సిందే. ప్రతిభ చూపించాల్సిందే. ఏఎన్నార్ కొడుకు నాగార్జునకే తప్పలేదంట. అసలేం జరిగింది..ఎందుకు ఆ ఇంటి చుట్టూ పడిగాపులు కాయాల్సి వచ్చిందో తెలుసుకుందాం.
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడున్న హీరోల్లో చాలామందికి తమకంటూ ఓ ప్రత్యేకత, ఓ స్థానం ఉంది. ఆ స్థానానికి చేరుకునేందుకు ఆయా సమయాల్లో ఆ నటులు చేసిన కష్టం ఉంది. చిత్తశుద్ధి ఉంది. అంకితభావం ఉంది. ఏదీ వారికి సులభంగా చేతికి దక్కలేదు. ఇప్పుడు మన్మధుడిగా, ఏఎన్నార్ కొడుకిగా అందరికీ తెలిసిన ప్రఖ్యాత నటుడు కింగ్ నాగార్జున కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులు వింటే ఆశ్చర్యమేస్తుంది. ఛాన్స్ కోసం ఓ దర్శకుడి ఇంటి చుట్టూ తిరిగానంటూ తన అనుభవాల్ని పంచుకున్నాడు కింగ్ నాగార్జున.
టాలీవుడ్ హీరో జగపతి బాబు కొత్తగా ప్రారంభించిన జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో మొదటి ఎపిసోడ్ నాగార్జునతో పూర్తయింది. ఈ షోలో వెల్లడించిన వివిధ అంశాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రఖ్యాత నటుడు ఏఎన్నార్ కొడుకుగా సినీ పరిశ్రమలో ఎంటర్ అయినా ఇబ్బందులు తప్పలేదంట. కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చిందంటున్నాడు నాగ్. ఇప్పుడు స్టార్ హీరోగా నిలదొక్కుకోవడం వెనుక నాడు పడిన శ్రమ ఉందని అంటున్నాడు. తాజాగా కూలీ చిత్రంతో నెగెటివ్ రోల్ ప్రారంభించిన నాగార్జున ఓ సినిమాలో అవకాశం కోసం ఓ స్టార్ దర్శకుడి ఇంటి చుట్టూ పడిగాపులు కాశారంట.
ఎవరా స్టార్ డైరెక్టర్
కెరీర్‌లో హిట్స్ , ఫ్లాప్స్ రెండూ చూశానని చెప్పిన నాగార్జునకు స్టార్ దర్శకుడు మణిరత్నంతో సినిమా చేయాలని ఉండేదట. ఎందుకంటే ఆయన తీసిన మౌనరాగం సినిమాకు నాగ్ దాసోహమయ్యాడు. కానీ మణిరత్నం అంత సులభంగా ఎవరికీ అవకాశం ఇచ్చేవారు కాదు. ఓ రోజు మణిరత్నం రోజూ వాకింగ్ చేసే పార్క్ వద్దకు వెళ్లి విష్ చేసి..ఓ సినిమా చేద్దాం సర్ అనడిగితే ఏం సమాధానం ఇవ్వలేదట. దాంతో విధి లేక రోజూ అదే సమయానికి అంటే మార్నింగ్ వాక్ సమయానికి ఇంటికెళ్లి నిల్చునేవాడినన్నారు. అలా మణిరత్నం కరుణించాక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. అదే తెలుగు సినిమా చరిత్రలో సూపర్ హిట్‌గా నిలిచి నాగ్ కెరీర్ మలుపు తిప్పిన అద్భుతమైన దృశ్యకావ్యం గీతాంజలి. అంటే గీతాంజలి వెనుక చాలా కథ ఉందన్నమాట. ఆ తరువాత ఆర్జీవీతో శివ సినిమా కెరీర్ హైలైట్ అని చెప్పుకొచ్చారు.