ఈ రోజు ఇండియాలో ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే దానికి గల కారణం ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే. అయితే వాహనాలపై మువ్వన్నెల జెండాను ఏర్పాటు చేసుకుంటే శిక్ష తప్పదంటూ హెచ్చరిస్తున్నారు.
ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా బ్రిటీష్ వారి కబందహస్తాల నుంచి విముక్తి పొంది ఇండియాకు స్వాతంత్ర్యం సిద్దించిన రోజు అనగా ఆగస్ట్ 15 1947 నుంచి నేటి వరకు భారతీయులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా జరుపుకుంటారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మువ్వన్నెల జెండాను ఆకాశంలోకి ఎగరేసి సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ఆ రోజునాడు ప్రతి భారతీయుడు చాలా రకాలుగా దేశభక్తిని చాటుకుంటారు. అయితే కొందరు తమ కార్లపై త్రివర్ణ పతాక స్టిక్కర్స్, జాతీయ జెండా రంగులను ఏర్పాటు చేసుకుని తిరిగితుంటారు. అలాంటి వారు జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అసలు త్రివర్ణ పతాకాన్ని ఎవరు ఏర్పాటు చేసుకోవచ్చు? సాధారణ జనం ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు? ఆ వివరాలు మీకోసం..
జాతీయ పండుగైన స్వాతంత్య్ర దినోత్సవం నాడు చాలా మంది జెండా రంగులను ముఖంపై ధరించి, ఫ్లాగ్ ను వాహనాలపై ఏర్పాటు చేసుకుని జాతీయతను వ్యక్తపరుస్తుంటారు. అయితే కార్లపై త్రివర్ణ పతాకాన్ని, జెండా రంగులను ఏర్పాటు చేసుకుంటే ఇండియన్ ఫ్లాగ్ కోడ్ ప్రకారం నేరంగా పరిగణింపబడుతోంది. జాతీయ జెండాను సాధారణ వ్యక్తులు తమ వాహనాలపై ఏర్పాటు చేసుకునే హక్కు లేదు. కేవలం రాజ్యాంగబద్దమైన అత్యున్నత పదవుల్లో ఉన్నవారికి మాత్రమే మువ్వన్నెల జెండాను ఏర్పాటు చేసుకునే వెసులు బాటు కల్పించింది. ఆ వరుసలో చెప్పుకున్నట్లైతే… రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి, రాష్ట్ర కేబినెట్ మంత్రి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్(లోక్‌సభ-రాజ్యసభ), గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి వాహనాలపై మాత్రమే త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేయొచ్చు.
ఇక రాష్ట్రాల స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సుప్రీంకోర్టు సీజే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి వారి వాహనాలపై జెండాను ఏర్పాటు చేయొచ్చు. వీరు కాకుండా మరెవరైనా జాతీయ జెండాను వాహనాలపై ఏర్పాటు చేసుకుంటే పోలీసులు చలానా విధిస్తారు. అవసరమైతే కేసు నమోదు చేసి జైలు శిక్ష విదిస్తారు. కాగా ఇంకో వారం రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవం రాబోతోంది. కాబట్టి కారు కలిగిన వాహన దారులు పై విషయాన్ని దృష్టిలో ఉంచుకుని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాలని అధికారులు కోరుతున్నారు.