ఫిల్మ్ డెస్క్- భారత్ లో సినీ ప్రముఖులకు అభిమానులు ఎక్కువ. ఇక దక్షిణాదిలో ఐతే సినీ హీరోలకు వీరాభిమానులు ఉన్నారు. హీరోలకు, హీరోయిన్స్ కు గుడులు కట్టారంటే వారి అభిమానం ఎంతో అర్ధం చేసుకోవచ్చు. ఐతే అభిమానులు తమ తమ అభిమాన తారలపై ఎవరికి తోచిన విధంగా వారి అభిమానం చూపుతుంటారు. చిత్తూరుకు చెందిన మెగాస్టార్ అభిమాని ఏకంగా 600 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించి ఆశ్చర్యపరిచాడు.
చిత్తూరు జిల్లాకు చెందిన ఈశ్వరయ్య మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని. ఆగష్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ఆయనను కలవాలని అనుకున్నాడు ఈశ్వరయ్య. ఐతే అందరిలా వెళ్లి కలవడంలో ప్రత్యేకత ఏముంది అనుకున్నాడు. అందుకే ఏకంగా తన అభిమాన హీరో కోసం సైకిల్ యాత్ర చేపట్టాడు ఈశ్వరయ్య. ఇంకేముంది అనుకున్న వెంటనే సరిగ్గా చిరంజీవి పుట్టిన రోజుకు 12 రోజుల ముందు సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు.
తిరుపతిలోని అలిపిరి నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించిన ఈశ్వరయ్య మొత్తం 12 రోజులు ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్నారు. తన అభిమాన హీరో చిరంజీవిని కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన కోసం ఫ్యాన్ సైకిల్ యాత్ర చేయడం, అంత దూరం సైకిల్ పై ప్రయాణించి రావడం పట్ల చిరంజీవి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈశ్వరయ్య సైకిల్ ప్రయాణం గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
ఈశ్వరయ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు చిరంజీవి. తన పుట్టిన రోజు నాడు తనను కలిసేందకు ఈశ్వరయ్య అలిపిరి నుంచి ఆగస్టు 10న బయలు దేరాడని చిరంజీవి తెలిపారు. అభిమానులు తమపై చూపే ప్రేమ తమకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని ఈ సందర్బంగా చిరంజీవి అన్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ కలిసే ఏర్పాట్లు చేయాలని ఈశ్వరయ్య కోరగా, చిరంజీవి ఆ ఏర్పాట్లు చేయించారు.
సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ కల్యాణ్ ను సెట్స్ లో కలిసిన తర్వాత ఈశ్వరయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కలవడం చాలా ఆనందంగా ఉందని, ఇద్దరినీ కలవడం తన అదృష్టమని చెప్పాడు.