ఫిల్మ్ డెస్క్- భీమ్లా నాయక్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా. దగ్గుబాటి రానా ఈ మూవీలో పవన్ తో కలిసి నటిస్తున్నారు. సంక్రాతి పండగకు భీమ్లా నాయక్ విడుదల కావాల్సి ఉంది. కానీ ఆర్ఆర్ఆర్, ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలు సైతం సంక్రాతికే రిలీజ్ అవుతున్న నేపధ్యంలో, ఓ నెల రోజుల పాటు వాయిదా వేసి శివరాత్రి సందర్బంగా ఫిబ్రవరి 25న విడుదల చేయాలని నిర్ణయించారు.
సంక్రాతికి తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ విడుదల అవుతుందని ఎంతో ఆశతో ఎదురుచూసిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో అభిమానులను కూల్ చేయడానికి భీమ్లా నాయక్ యూనిట్ ప్లాన్ చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా భీమ్లా నాయక్ లోని హిట్ పాట లాలా భీమ్లా.. పాటకు డీజే వెర్షన్‌ను రూపొందించి విడుదల చేసింది చిత్ర యూనిట్.
మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోశియమ్ సినిమా భీమ్లా నాయక్ గా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరనస నిత్యా మీనన్ నటిస్తుండగా, రానా దగ్గుబాటి జోడీగా సంయుక్తా మీనన్ నటిస్తున్నారు.
భీమ్లా నాయక్ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలు, ప్రోమోలకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో భీమ్లా నాయక్ పాత్రలో నటిస్తుండగా, డానియల్ శేఖర్ అనే పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. ఇద్దరు వ్యక్తుల ఇగోల కారణంగా వారి జీవితాల్లో చోటు చేసుకున్న మార్పులే ఈ సినిమా కథ. అన్నట్లు లాలా భీమ్లా డీజే సాంగ్ రిలీజ్ అయిన కొంత సేపటికే రికార్డు స్థాయిలో వీవ్స్, లైక్స్ తో దూసుకుపోతోంది.