రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. ఉక్రెయిన్ చుట్టూ సుమారు లక్షన్నర మంది రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలను ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం తమ బలగాలకు సైనిక చర్యకు దిగాల్సిందిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు మొదలయ్యాయి. అయితే రష్యా.. ఏయే మార్గాల్లో ఉక్రెయిన్ పై దాడులు చేయవచ్చు.. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడానికి అనుకూలించే మార్గాలు ఏవి అన్నదానిపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. యుద్ధ వ్యూహకర్తలు అంచనాల రష్యా ప్రకారం ప్రధానంగా మూడు మార్గాల్లో ఉక్రెయిన్ పై దాడులు జరపవచ్చని భావిస్తున్నారు.
రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు భాగంలోని లుహాన్క్స్, దోనెట్క్స్ ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించింది. శాంతిస్థాపన పేరుతో రష్యన్ బలగాలు ఇప్పటికే అక్కడ మోహరించాయి. రష్యన్ బలగాలు దోనెట్క్స్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని.. ఉక్రెయిన్ లోని నిప్రో, జపోరిఝాఝియాల ప్రాంతాలపై దాడులకు పాల్పడే అవకాశముందని భావిస్తున్నారు.
అధికారంలో ఉన్న ఉక్రెయిన్ సర్కారును పూర్తిగా పడగొట్టాలని రష్యా భావిస్తే.. రాజధానిపై ఉత్తర ప్రాంతం నుంచి దాడికి పాల్పడవచ్చని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ తెలిపింది. ఈ వ్యూహాన్ని అమలుచేయాలని రష్యా భావిస్తే.. బెలారస్ కేంద్రంగా కొంత సేనలు.. రష్యాలోని ట్రోబోర్టునో, నోవీ యుకోవిచి ప్రాంతాల నుంచి మరింత బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై దాడులకు దిగొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 30 వేల రష్యన్ బలగాలు ఆయా ప్రాంతాలలో మోహరించాయి.
2014 లో రష్యా ఆక్రమించుకున్న క్రిమియా నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై దాడి చేయవచ్చని భావిస్తున్నారు. ఉత్తర, పశ్చిమ, తూర్పు భూభాగాలతో పాటు.. క్రిమియా నుంచి కూడా రష్యా సేనలు చుట్టుముట్టడం వల్ల ఉక్రెయిన్ బలగాలు మధ్యలో చిక్కుకుపోయే అవకాశం ఉంది.ఇవి కాక.. ఇతర మార్గాలు
ఇక రష్యాలోని రొస్తోవ్-ఆన్-డాన్ నుంచి ఉక్రెయిన్ లోని మెలిటోపోల్ ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక బెల్డరొడ్ సరిహద్దు ప్రాంతాల నుంచి నుంచి క్రెమెన్ చుక్ ప్రాంతాలపై దాడులు చేయవచ్చని భవిస్తున్నారు.
పశ్చిమ ప్రాంతంలోని ఒడెసా, తూర్పు ప్రాంతంలోని మెలిటోపోల్, మేరియపొల్ ను రష్యా లక్ష్యంగా చేసుకోవచ్చని వ్యూహకర్తలు భావిస్తున్నారు.. ఇప్పటికే నల్ల సముద్రంలో మోహరించిన రష్యా నౌకా దళాలు.. క్రిమియా నుంచి జరిగే దాడుల్లో పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
