కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తి అయింది. ఇప్పటికి అనేక రూపాలను సంతరించుకున్న ఈ కోవిడ్ 19 కొత్త రూపాన్ని సంతరించుకుని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. మొన్నటి వరకు డెల్టా వేరియంట్ అయితే ఇప్పుడు ఒమిక్రాన్ కొత్తగా వచ్చిన వేరియంట్ ప్రపంచ దేశాలను మళ్ళీ గజగజా వణికిస్తోంది. ఆఫ్రికా ఖండాన్ని దాటి యూరోప్, ఆసియా ఖండాల్లో అడుగు పెట్టింది. పలు దేశాల్లో నేనున్నానంటూ వెలుగులోకి వచ్చి ఆందోళన పెంచుతోంది. తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే 20 దేశాల్లో అడుగు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇదేదో ఇప్పుడే బయటపడినది కాదని, దక్షిణాఫ్రికాలో వెలుగు చూడడానికి ముందే అక్టోబరులోనే ఇది వెలుగుచూసిందని, ఈ క్రమంలో పలు దేశాలకు పాకిపోయిందని చెబుతున్నారు. అయితే, దీని తీవ్రతపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. యూరోపియన్ యూనియన్లోని 11 దేశాల్లో ఇప్పటి వరకు 44 కేసులు నమోదు కావడం ఇందుకు ఊతమిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటి వరకు 20 దేశాలకు పాకిపోయింది. కొత్త వేరియంట్ గురించి ప్రపంచ దేశాలను దక్షిణాఫ్రికా అప్రమత్తం చేయడానికి ముందే అంటే అక్టోబరులోనే అక్కడి నుంచి వచ్చిన వారికి నైజీరియా పరీక్షలు చేసి నమూనాలు సేకరించింది.
దక్షిణాఫ్రికా ఈ వేరియంట్ గురించి తెలుపుతూ.. ప్రపంచ దేశాలను అలెర్ట్ చేయడానికి ముందే ఆ దేశం నుంచి వచ్చిన ప్రయాణీకుల నమూనాలను తాము ఈ వైరస్ ను కనుగొన్నామని తెలిపింది. అమెరికాలో ఒక కేసు, జపాన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో జపాన్ దేశం అత్యవసర చర్యలు తీసుకుంది. ప్రస్తుతం జర్మనీ, ఆస్ట్రియా, దక్షిణ కొరియాల్లో డెల్టా కారక కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. మరోవైపు క్రిస్మస్ రానున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాపించకుండా పలు దేశాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి.