న్యూ ఢిల్లీ- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు, బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. భారత్ లో ఒమిక్రాన్ వేరియింట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఒమిక్రాన్ మెల్ల మెల్లగా వ్యాప్తి చెందుతోందని మోదీ అన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ తో చాలా ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ప్రధాని చెప్పారు. ఒమిక్రాన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, రాష్ట ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. ప్రజలందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, జాగ్రత్తగా ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఇక జనవరి 3వ తేదీ నుంచి 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పాఠశాలకు వెళ్లే పిల్లలకు వ్యాక్సిన్ వేయడం వల్ల తల్లిదండ్రులకు భరోసా వస్తుందని చెప్పారు. మరోవైపు 60 ఏళ్లు పైబడిన వారికి, ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు జనవరి 10వ తేదీ నుంచి కరోనా బూస్టర్ డోసు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు మోదీ తెలిపారు.
త్వరలోనే డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నామని ఆయన స్పష్టం చేశారు. అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవడం, కరోనా నిబంధనలు పాటిస్తే ఒమిక్రాన్‌ను దేశం నుంచి తరిమికొట్టొచ్చని ప్రధాని పిలుపునిచ్చారు. దేశంలో 2021 జనవరి 26 నుంచి వ్యాక్సిన్ ప్రారంభించగా, ఇప్పటివరకు అర్హులైన 61శాతం మందికి రెండు డోసులు వేశామన్నారు. అనేక దేశాలతో పోలిస్తే వ్యాక్సినేషన్‌లో భారత్ ఎందో ముందంజలో ఉందని మోదీ తెలిపారు.
My address to the nation. https://t.co/dBQKvHXPtv
— Narendra Modi (@narendramodi) December 25, 2021