ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యలు ఆజ్యం పోస్తున్నాయి. న్యూక్లియర్ వార్నింగ్ హెచ్చరికల తరువాత ఇప్పుడు ముకేశ్ అంబానీ రిఫైనరీని టార్గెట్ చేశాడు. తాజా హెచ్చరికల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ ప్రేలాపనలు రోజురోజుకూ తీవ్రమౌతున్నాయి. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని పెంచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇండస్ రివర్‌పై ఇండియా నిర్మించే డ్యామ్‌లను పేల్చేస్తామని హెచ్చరించిన ఆసిఫ్ మునీర్..ఆ తరువాత తాము పోతూ పోతూ సగం ప్రపంచాన్ని న్యూక్లియర్ దాడులతో నాశనం చేస్తామంటూ మరోసారి హద్దులు దాటేశారు. ఇప్పుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
జామ్ నగర్ ఆయిల్ రిఫైనరీని పేల్చేస్తాం
భవిష్యత్తులో ఇండియాతో ఏదైనా వివాదం తలెత్తితే జామ్ నగర్‌లోని ముకేశ్ అంబానీకి చెందిన ఆయిల్ రిఫైనరీని టార్గెట్ చేస్తామని పాక్ ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ హెచ్చరించారు. పహల్గామ్ దాడి తరువాత ఆపరేషన్ సింధూర్‌తో పీవోకే, పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలు ఇండియా ధ్వంసం చేసిన తరువాత ఈ హెచ్చరికలు రావడం గమనార్హం.
యూఎస్‌లోని ఫ్లోరిడా నగరం టాంపాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసిఫ్ మునీర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేమేం చేయగలమో ఇండియాకు చూపిస్తామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమెరికా గడ్డ నుంచి ఇండియాను హెచ్చరించడం ఇది రెండోసారి. ఏదేమైనా సరే పాకిస్తాన్‌కు రావల్సిన నీటి హక్కులను కాపాడుకుంటామని కూడా ఆయన స్పష్టం చేశారు. సింధూ నదిపై ఇండియా డ్యామ్ నిర్మించేవరకు చూసి..ఆ తరువాత పేల్చేస్తామని హెచ్చరించారు. ఇండస్ నది భారతీయుల ఆస్థి కాదని స్పష్టం చేశారు.