న్యూ ఢిల్లీ- దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. డెల్టా వేరియంట్ కంటే మూడురెట్ల వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ తో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేకంగా లేఖలు రాశారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా డెల్టా వేరియంట్ ఉందని, తాజాగా, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అయిన ఒమిక్రాన్ అందుకు మూడు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయాని కేంద్రం లేఖలో పేర్కొంది. అందుకే, అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తత, డేటా ఎనాలిసిస్, నిర్ణయాత్మకంగా వ్యవహరించడం, కంటైన్‌మెంట్ విషయంలో చురుగ్గా ఉండాలని రాజేశ్ భూషన్ సూచించారు. అంతే కాదు అవసరం ఐతే వార్‌రూంలను ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించిన ప్రాంతాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్రం సూచించింది. జిల్లా స్థాయిల్లో కంటెయిన్ మెంట్ జోన్ ల ఏర్పాటును కట్టుదిట్టం చేయడంతో పాటు, అవసరమైన చోట్ల రాత్రి కర్ఫ్యూ విధించాలని స్పష్టం చేసింది. వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో జనం ఎక్కువగా గుమికూడకుండా నియంత్రించాలని కేంద్రం తేల్చి చెప్పింది. వైరస్ బాధితుల హోం ఐసోలేషన్ సమయంలో నిబంధనలను కఠినంగా పాటించాలని లేఖలో పేర్కొంది,
గత వారం రోజులుగా టెస్ట్ పాజిటివిటీ రేటు 10శాతం, అంతకంటే ఎక్కువగా ఉన్న, ఐసీయూ బెడ్ ఆక్యుపెన్సీ 40శాతం, ఆపైన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ఇక ఇంటింటికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అర్హులైన మొదటి, రెండో డోస్ లబ్ధిదారులందరికీ వ్యాక్సిన్ వేగంగా అందేలా చూడాలని కేంద్రం రాసిన లేఖలో స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్‌లో జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైన జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పేర్కొంది.