ఆపరేషన్ సింధూర్ సాధించిన విజయాలకు ఇప్పుడు గూగుల్ సాక్ష్యమిస్తోంది. ధ్వంసమైన జైష్ ఎ మొహమ్మద్ కార్యాలయాలు గూగుల్ ఎర్త్ లో స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
జమ్ము కాశ్మీర్ పహల్గామ్ లో ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఉగ్ర దాడి అనంతరం ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. శత్రుదేశంలోకి చొచ్చుకెళ్లిన విమానాలు అక్కడి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి క్షేమంగా తిరిగొచ్చేశాయి. అయితే దీనికి సాక్ష్యమేంటని వాదించేవారికి, భారత్ దాడులు లక్ష్యాన్ని ఛేదించలేదన్న పాకిస్తాన్ విమర్శలకు గూగుల్ విట్ నెస్ ఇస్తోంది. పాకిస్తాన్ లోని బహవల్పూర్ లో ఉన్న జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాద ప్రధాన కార్యాలయంగా పిలిచే మర్కజ్ సుభానల్లాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది. నిన్నటి వరకూ ఇది కన్పించేది కాదు.
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా మే 7వ తేదీన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్స్ ప్రయోగించాయి. ఇందులో భాగంగా బహవల్పూర్ లోని జైష్ ఎ మొహమ్మద్ ప్రధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. ఉగ్రవాదుల రిక్రూట్ మెంట్, నిధుల సమీకరణ, శిక్షణ అంతా ఇక్కడే నడుస్తుంటుంది.
మిస్సైల్స్ దాడిలో ఈ ఉగ్రవాద కార్యాలయం ఎలా ధ్వంసమైందో గూగుల్ ఎర్త్ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. మాక్సర్ టెక్నాలజీస్ ఈ శాటిలైట్ చిత్రాలు విడుదల చేసింది. దాడి జరగడానికి ముందు ఈ శిబిరం 18 ఎకరాల్లో విస్తరించి ఓ మసీదు, మదర్సా, శిక్షణ శిబిరంతో ఉండేది. ఇప్పుడు గూగుల్ ఎర్త్ లో చూస్తే మాత్రం మసీదు గోపురంలో రంద్రాలు, శిధిలాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. గూగుల్ మ్యాప్స్ కూడా ఈ స్థలం క్లోజ్ అని చూపిస్తుంది.
భారతదేశం జరిపిన మిస్సైల్స్ దాడిలో జైష్ ఎ మొహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజహర్ కుటుంబంలోని 10 మంది మరణించినట్టు స్వయంగా మసూద్ అజహర్ ధృవీకరించారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు ఇండియా పంపించిన ఓ బలమైన వార్నింగ్ ఇది. భారత త్రివిధ దళాలు ఎంత కచ్చితత్వంతో దాడులు జరిపాయనేది ఈ ఫోటోల్ని చూస్తే అర్ధమౌతుంది.