ఫిల్మ్ డెస్క్- పుష్ప..ది రైజ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటించింది. పాన్ ఇండియా చిత్రంగా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 17న విడుదలైన పుష్ప వసూళ్ల విషయంలో రికార్డులు సృష్టిస్తోంది.
తొలి రోజు 71 కోట్ల రూపాయలు రాబట్టగా, రెండో రోజు 45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా పుష్ప 116 కోట్ల గ్రాస్ సాధించింది. మరి ఈ పాన్ ఇండియా సినిమా పుష్పసినిమాకు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, హీరోయిన్ రష్మిక మందన్నా, ఇతర నటీ నటులు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఫిల్మీనగర్ వర్గాల సమాచారం ప్రకారం, పుష్ప చిత్రం కోసం అల్లు అర్జున్ ఏకంగా 50 కోట్ల పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. ఇక కన్నడ సోయగం రష్మిక మందన్నా 8 కోట్ల రూపాయల మేర డబ్బులు తీసుకుందని సమాచారం. పుష్ప సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు సుకుమార్ 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతోంది. ఇక ఈ మూవీలో విలన్‌గా నటించిన మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ 3.5 కోట్ల రూపాయలు తీసుకున్నాడట.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సైతం 3.5 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. పుష్పలో పాత్రను పోషించిన యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరోజు షూటింగ్‌కు 1.5 లక్షల వరకు అందుకున్నట్లు సమాచారం. మొత్తానికి పుష్ప సినిమాకు హీరో అల్లు అర్జున్ నుంచి మొదలు నటీ నటులంతా భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నారన్నమాట.