మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రతి ఒక వర్గానికి నచ్చింది. చిన్న, పెద్ద, ఆడ, మగ, ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వింటేజ్ చిరుని చూసినట్టు ఉందని అంటున్నారు. చిరంజీవికి అన్ని రంగాల్లోనూ అభిమానులు ఉన్నట్టే.. రాజకీయ పార్టీల్లోనూ అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీలో హీరోలకి ఆయా రాజకీయ నాయకులు అభిమానులుగా ఉండడం మనం చూశాం. పార్టీలు వేరైనా గానీ ప్రత్యర్థి పార్టీకి చెందిన హీరోనైనా అభిమానించే నాయకులు ఉన్నారు. వైసీపీ పార్టీ నుంచి జగన్ నే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జగన్ కి బాలకృష్ణ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. ఇక కొడాలి నానికి ఎన్టీఆర్ అంటే అభిమానం, ఇష్టం, క్లోజ్ కూడా.
తాజాగా చిరంజీవి సినిమాని వైసీపీ అభిమాని చూశారు. కుటుంబ సమేతంగా వెళ్లి మరీ సినిమా చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి వాల్తేరు వీరయ్య చూశారు. కె3కె పిక్చర్ ప్యాలెస్ లో సినిమాని చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమానినని అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడడం ఆనందంగా ఉందని అన్నారు. అన్నదమ్ముల అనుబంధంతో వాల్తేరు వీరయ్య సినిమా చాలా బాగుందని, ప్రతీ ఒక్కరూ చూడాలని అన్నారు. ఇక రాజకీయం గురించి మాట్లాడితే వేరే విధంగా ఉంటుందని అంటూ పవన్ కి సలహా ఇచ్చారు. అన్నయ్యని చూసి తమ్ముడు నేర్చుకోవాలని తెలియజేస్తున్నాను అంటూ సలహా ఇచ్చారు.