సాధారణంగా ఇండస్ట్రీలో పండగలకు ఉండే క్రేజే వేరు. టాలీవుడ్ హీరోలకు పండగలు అంటే చాలా సెంటిమెంట్ కూడా. పలానా ఫెస్టివల్ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ సినిమా హిట్ అని వారి నమ్మకం. ప్రస్తుతం అలాంటి వాతావరణమే నెలకొంది టాలీవుడ్ లో. సంక్రాంతి బరిలో దిగడానికి బడాబడా హీరోలు సిద్ధంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ లతో పాటుగా మరికొన్ని చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇక దళపతి విజయ్ నటించిన ‘వారసుడు’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. తమిళంతో పాటుగా తెలుగులో కూడా ఈ చిత్రం రిలీజ్ అవ్వబోతుంది. ఈ క్రమంలోనే దిల్ రాజు భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. వారసుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
దళపతి విజయ్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన చిత్రం ‘వారిసు’. తెలుగులో వారసుడుగా సంక్రాంతి బరిలో దిగబోతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. పబ్లిసిటీ చేయడంలో దిల్ రాజు ను మించిన నిర్మాతలు లేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరో సారి తన మార్క్ పబ్లిసిటీతో వారసుడు సినిమాను ప్రమోట్ చేయాలని భావిస్తున్నాడు. అందులో భాగంగానే వారసుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిథిగా తీసుకురానున్నట్లు సమాచారం. దాంతో సినిమాపై అంచనాలను పెంచడంతో పాటుగా.. భారీ ఓపెనింగ్స్ రాబట్టాలని చూస్తున్నారు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న వారసుడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డిసెంబర్ 24న చెన్నైలో.. అలాగే 27వ తారిఖున తెలుగులో నిర్వహించడానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిథిగా దిల్ రాజు పిలిచినట్లు సమాచారం. ఒకే వేదికపై పవన్, విజయ్ కనిపిస్తే సినిమాపై ఓ బజ్ క్రియేట్ అవుతుందన్నది దిల్ రాజు ప్లాన్. పైగా పొంగల్ బరిలో మెగాస్టార్, బాలకృష్ణ ల చిత్రాలు కూడా ఉండటంతో బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయం అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ నటించిన బంగారం మూవీ ఓపెనింగ్ కు విజయ్ వచ్చాడు. అదీకాక పవన్ కు నేను బిగ్ ఫ్యాన్ అని పలు సందర్భాల్లో విజయ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండే డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ఉన్న అనుబంధం కారణంగా ఈ ఈవెంట్ కు మహేష్ బాబు ను సైతం అతిథిగా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు సినీ విశ్లేషకులు.