ఈ మధ్యకాలంలో సినీతారలు ఏ విషయాన్నైనా సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తున్నారు. సినిమా అప్ డేట్స్ అయినా, వ్యక్తిగత విషయాలైనా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి చెబుతున్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ.. హీరోయిన్స్ పెళ్లి వీడియోలను ఓటిటిలలో రిలీజ్ చేయడం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పెళ్లి కబురేమో సోషల్ మీడియాలో.. పెళ్లి లైవ్ టెలికాస్ట్ ఏమో ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో.. ఈ కొత్త పోకడలు చూస్తూ అవాక్కవడమే ప్రేక్షకులు, అభిమానుల వంతు అవుతోంది. ఎందుకంటే.. ఇదే బాటలో తాజాగా యాపిల్ బ్యూటీ హన్సిక చేరింది. అవును.. దేశముదురు హీరోయిన్ హన్సిక వచ్చే నెలలోనే పెళ్లి పీటలెక్కబోతోంది.
ఇప్పటికే ఈ విషయం అందరిదాకా చేరుంటుంది. వచ్చే నెల అంటే డిసెంబర్ 4న.. హన్సిక తన స్నేహితుడు సోహైల్ ని పెళ్లాడబోతుంది. పెళ్లి కోసం ఏకంగా నెల రోజుల ముందే జైపూర్ లోని ముందోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్ లో ఏర్పాట్లు మొదలు పెట్టేసింది. పెళ్లికి రెండు రోజుల ముందు నుండే హన్సిక – సోహైల్ ల సంగీత్, మెహందీ ఫంక్షన్స్ జరగనున్నాయి. అయితే.. హన్సిక పెళ్లికి సంబంధించి తాజాగా ఓ వార్త తెగవైరల్ అవుతోంది. ఈ ఏడాది స్టార్ హీరోయిన్ నయనతార.. దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లాడిన వీడియోను ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ కి అమ్మేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హన్సిక కూడా అదే ఐడియాను ఫాలో అవుతుందట.
హన్సిక తన పెళ్లికి సంబంధించి లైవ్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారికి అప్పగించిందని.. దీనికి సంబంధించి నెట్ ఫ్లిక్స్ తో భారీ డీల్ కూడా కుదుర్చుకుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన హన్సిక.. దేశముదురు సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. మొదటి సినిమానే సూపర్ క్రేజ్ తెచ్చేసరికి వరుసగా స్టార్స్ సరసన అవకాశాలు అందుకొని ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్స్ సరసన సినిమాలు చేసి స్టార్డమ్ అందుకుంది. హన్సిక అందానికి, నటనకు ఫిదా తమిళ ఫ్యాన్స్.. ఏకంగా అమ్మడికి గుడి కట్టించడం విశేషం. ప్రస్తుతం హన్సిక పెళ్లి చేసుకోబోతుందని తెలిసి ఫ్యాన్స్ నిరాశచెందారట. చూడాలి మరి నెట్ ఫ్లిక్స్ లో హన్సిక తన పెళ్లిని లైవ్ స్ట్రీమింగ్ చేయనుందేమో!