ఎన్టీఆర్ పెద్ద కొడుకు నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ హీరోగా, ‘రక్ష’, ‘జక్కన్న’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘బ్రీత్’ - ‘వైద్యో నారయణో హరి’ టీజర్ రిలీజ్..
నటరత్న ఎన్టీఆర్ తర్వాత ఆయన నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య అతి తక్కువ టైంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకోవడమే కాకుండా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని, అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. హరికృష్ణ, బాలయ్య, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ బాలనటులుగానే సత్తా చాటారు. నటసింహ తర్వాత నందమూరి వంశం మూడోతరం నట వారసులుగా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, తారక రత్నలతో పాటు ఎన్టీఆర్ పెద్ద కొడుకు నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ ‘ధమ్’ అనే సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యాడు. సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ సమర్పకురాలిగా వ్యవహరించారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడం, తన నటన గురించి విమర్శలు రావడంతో తనకు సినిమాలు సరిపడవని, వ్యాపార రంగంలో రాణిస్తూ బిజీ అయిపోయాడు చైతన్య కృష్ణ. ఒకసారి ముఖానికి మేకప్ వేసుకుంటే నటనపై మక్కువ పోదు అంటుంటారు. అలాంటిది నటన అనేది నందమూరి నెత్తురులో ఉంది కాబట్టి దాదాపు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకాభిమానుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.
‘రక్ష’, ‘జక్కన్న’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వంశీ కృష్ణ ఆకెళ్ల చెప్పిన కథ నచ్చడంతో హీరోగా నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయిన చైతన్య.. తన తండ్రి నందమూరి జయకృష్ణను నిర్మాతగా మార్చి, తాత, నానమ్మల పేరు వచ్చేలా బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్ స్థాపించడం విశేషం. ఈ చిత్రానికి ‘బ్రీత్’ అనే టైటిల్.. ‘వైద్యో నారయణో హరి’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఇంతకుముందు ‘అంతిమ పోరాటం’ అనే ట్యాగ్ పెట్టి తర్వాత మార్చారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిసిన సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ శనివారం విడుదల చేశారు. సినిమా కథ అంతా రాత్రి పూట జరుగుతుందని తెలుస్తోంది. టీజర్ ఆసక్తికరంగా సాగింది. త్వరలో జరుగబోయే ‘బ్రీత్’ ఆడియో లాంఛ్‌కి బాలయ్య ముఖ్య అతిథిగా రానున్నారని సమాచారం.