మన దగ్గర క్రికెట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఐపీఎల్ మాత్రమే. అంతలా పాపులారిటీ సంపాదించుకుంది. ఇంటర్నేషనల్ మ్యాచుల్ని కూడా మరిచిపోయేంతలా క్రేజ్ సంపాదించింది. ఇప్పటికే వేలకోట్ల బిజినెస్ తో ఐపీఎల్ రికార్డులు క్రియేట్ చేస్తుండగా.. ఇప్పుడు అదే రూట్ లోనే మహిళల ఐపీఎల్ కూడా వెళ్తోంది. గత రెండు మూడు సీజన్లు ఏదో నామమాత్రంగా జరుగుతున్న ఈ లీగ్ కి ఇప్పుడు మరింత క్రేజ్ ఏర్పడేలా కనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా మహిళల ఐపీఎల్ కు సంబంధించిన మీడియా హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. బీసీసీఐకి కాసుల పంట పండింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ఈ లీగ్ పై ఎవరికీ ఎలాంటి అంచనాల్లేవు. కానీ ఒక్క సీజన్ తో మొత్తం అందరి ఆలోచనే మారిపోయింది. ప్రస్తుతం ఒక్కో మ్యాచ్ కోసం రూ.80-90 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలా దాదాపు లక్ష కోట్ల విలువైన ఐపీఎల్.. ప్రపంచంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఇప్పట్లో దాన్ని అందుకోవడం చాలా కష్టమైన విషయం. అయితే ఇప్పుడు ఆ లిస్టులోకి మహిళా ఐపీఎల్ కూడా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా జరిగిన వేలంలో 2023-27 కాలానికి గానూ మహిళల ఐపీఎల్ మీడియా రైట్స్ ని వయకామ్ 18 సొంతం చేసుకుంది. దాదాపు రూ.951 కోట్లకు ఇవి అమ్ముడుపోయాయని బీసీసీఐ ప్రకటించింది. ఒక్కో మ్యాచ్ కోసం రూ.7.09 కోట్లని వయకామ్ చెల్లించనుందని భారత బోర్డు పేర్కొంది. సోమవారం జరిగిన వేలంలో హాట్ స్టార్, సోనీ లాంటి సంస్థల్ని వెనక్కి నెట్టి మరీ వయకామ్ ఈ డీల్ ని సొంతం చేసుకుంది.
‘మహిళల ఐపీఎల్ ప్రసార హక్కుల్ని గెలుచుకున్న వయకామ్ 18కు అభినందనలు. బీసీసీఐ, మహిళా క్రికెట్ పై మీకున్న నమ్మకానికి ధన్యవాదాలు. రానున్న ఐదేళ్లలో ఒక్కో మ్యాచ్ కోసం రూ.7.09 కోట్ల చొప్పున రూ.951 కోట్లు చెల్లించేందుకు వయకామ్ ఒప్పుకుంది. మహిళల క్రికెట్లో అపూర్వ ఘట్టమిది.’ అని బీసీసీఐ సెక్రటరీ జైషా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఐపీఎల్ మహిళల తొలి సీజన్ మార్చి మొదటి వారంలో ప్రారంభం కానుంది. ముంబయిలో జరిగే లీగ్ లో ఐదు జట్లు బరిలోకి దిగుతాయి. గతేడాది జూన్ లో జరిగిన వేలంలో పురుషుల ఐపీఎల్ కు సంబంధించిన ప్రసార హక్కుల్ని ఐదేళ్ల కాలానికిగానూ రూ.23,758 కోట్లు చెల్లించి వయకామ్ 18 దక్కించుకుంది. స్టార్ సంస్థ రూ.23,575 కోట్లకు టీవీ హక్కుల్ని సొంతం చేసుకుంది. మరి ఈ డీల్స్ చూసిన తర్వాత మీకేమనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.