క్రికెట్లో ఫ్రాంచైజీ లీగ్‌ల హవా రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వీటిని కంట్రోల్ చేయాలని ఐసీసీ భావిస్తోందట. లీగ్‌లకు షాక్ ఇచ్చేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు స్పోర్ట్స్‌లో ఫ్రాంచైజీ లీగ్‌లదే హవా. ఆ గేమ్, ఈ గేమ్ అని లేదు.. అన్నింటా వీటిదే ఆధిపత్యం. ఫుట్‌బాల్ దగ్గర నుంచి క్రికెట్, హాకీ, కబడ్డీ వరకు దాదాపుగా అన్ని ఆటల్లోనూ ఫ్రాంచైజీలు లీగ్‌లు వచ్చేశాయి. ఎంటర్టైన్మెంట్తో పాటు కమర్షియల్గానూ సక్సెస్ అవ్వడంతో తక్కువ వ్యవధిలోనే పదుల కొద్దీ లీగ్‌లు పుట్టుకొచ్చాయి. ఫుట్‌బాల్ అనే కాదు క్రికెట్లోనూ ఇదే పరిస్థితి. జెంటిల్మన్ గేమ్‌కు సంబంధించి ఫస్ట్ లీగ్‌ను ప్రవేశపెట్టింది బీసీసీఐ అనే చెప్పొచ్చు. 2008లో ఐపీఎల్‌ను మొదలుపెట్టింది భారత క్రికెట్ బోర్డు. స్వదేశీ స్టార్లకు తోడు విదేశీ ప్లేయర్లు, స్థానిక ఆటగాళ్లు కూడా తోడవ్వడంతో లీగ్ ఐడియా సూపర్ సక్సెస్ అయింది. ఫలానా నగరానికి ఒక ఫ్రాంచైజీ అంటూ పెట్టడం, స్టార్లు తమ ధనాధన్ ఆటతీరులో లీగ్స్‌ను విజయవంతం చేశారు. క్రికెట్లో చూసుకుంటే.. ఐపీఎల్‌తో పాటు బిగ్ బాష్ లీగ్, బంగ్లా ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్‌లు ఉన్నాయి.
ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్‌కు సౌదీ ప్లాన్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయ టెస్టు క్రికెట్ ఉనికిని కాపాడుకునేందుకు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. వరల్డ్ వైడ్‌గా ఉన్న ఫ్రాంచైజీలను నియంత్రించాలని ఐసీసీ భావిస్తోందట. ఇందుకోసం తొలుత రెండు రూల్స్ తీసుకురానుందని టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించింది. ఫ్రాంచైజీ లీగ్స్‌లో జట్ల ప్లేయింగ్ ఎలెవన్‌లో విదేశీ ఆటగాళ్ల సంఖ్యను నాలుగుకు కుదించనుందట ఐసీసీ. అలాగే టీ20 లీగ్స్‌లో ఆడే ప్రతి ప్లేయర్‌కు సంబంధించి జాతీయ జట్టుకు ఫ్రాంచైజీలు కొంత మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందట. లీగ్స్‌ను కంట్రోల్ చేసేందుకు ఐసీసీ మరిన్ని రూల్స్ తీసుకురానుందట. ఒకవేళ అవన్నీ అమల్లోకి వస్తే మాత్రం ఫ్రాంచైజీ లీగ్స్ నిర్వాహకులు తలలు పట్టుకోక తప్పదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.